రష్యా వ్యాక్సిన్‌: 2వ దశ ప్రయోగాలు చేయాల్సిందేనా? - Dr Reddys asked to reapply for phase 2 3 clinical trials of Russian vaccine
close
Updated : 06/10/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రష్యా వ్యాక్సిన్‌: 2వ దశ ప్రయోగాలు చేయాల్సిందేనా?

మళ్లీ అనుమతి తీసుకోవాలని డాక్టర్‌ రెడ్డీస్‌కు సూచన

దిల్లీ: మూడో దశకు చేరుకున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-V క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప్రయోగాల కోసం మరోసారి అనుమతి తీసుకోవాలని కేంద్ర ఔషధాల ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీఓ) డాక్టర్‌ రెడ్డీస్‌ను కోరింది. వ్యాక్సిన్‌ రెండో, మూడో దశ ప్రయోగాల కోసం సవరించిన ప్రొటోకాల్‌ ఆధారంగా మరింత సమాచారాన్ని అందించాలని తాజాగా స్పష్టంచేసింది. ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించడంతోపాటు ఇక్కడ సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకొంది. ఇందులో భాగంగా ప్రయోగాల అనుమతి కోసం గతవారమే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అనుమతి కోరింది.

డాక్టర్‌ రెడ్డీస్‌ కోరిన అనుమతి దరఖాస్తులను సీడీఎస్‌సీఓలోని నిపుణుల బృందం(ఎస్‌ఈసీ) సోమవారం క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం ఈ ప్రయోగాలు జరపడం కోసం సవరించిన నియమాల ఆధారంగా మరోసారి అనుమతి పొందాలని డాక్టర్‌ రెడ్డీస్‌కు సూచించింది. ముఖ్యంగా మూడో దశతోపాటే రెండోదశ ప్రయోగాలు చేపట్టాలని కోరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ప్రయోగాలకు సంబంధించి మరింత సమాచారాన్ని కూడా సీడీఎస్‌సీఓ కోరినట్లు తెలుస్తోంది. ‘ నిపుణుల బృందం సూచన ప్రకారం, భారత్‌లో మూడో దశ ప్రయోగాలను నేరుగా చేపట్టే ఆస్కారం లేదు. ఇందుకోసం మూడోదశతోపాటే రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. వీటికోసం రివైజ్‌డ్‌ ప్రొటోకాల్‌ ఆధారంగా ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాల కోసం డాక్టర్‌ రెడ్డీస్‌ మరోసారి దరఖాస్తు చేసుకోవాలి అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలాఉంటే, ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతోన్న స్పుత్నిక్‌-V వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలు రష్యాలో దాదాపు 40వేల మందిపై జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించడంతోపాటు ఇక్కడ సరఫరా చేసేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకొంది. దీనిలోభాగంగా భారత్‌లోని నియంత్రణ సంస్థల అనుమతి లభించిన అనంతరం 10కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌కు అందజేస్తుంది.

ఇక భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్‌లు రెండో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌తో కలిసి తయారుచేసిన వ్యాక్సిన్‌తోపాటు మరోసంస్థ జైడస్‌ క్యాడిలా అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌లు రెండోదశ ప్రయోగాల్లో ఉన్నాయి. వీటితోపాటు ఆక్స్‌ఫర్డ్‌ టీకా రెండు, మూడో దశల ప్రయోగాలను పుణెకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ సహకారంతో మనదేశంలో నిర్వహిస్తోంది. వీటికోసం సీరం ఇనిస్టిట్యూట్‌ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకొంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని