సచిన్‌ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.. దాంతో - England spinner Monty Panesar recalls how he Sachin Tendulkars first Test wicket
close
Published : 08/08/2020 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సచిన్‌ సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.. దాంతో

ఇంగ్లాండ్‌ వెటరన్‌ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ లాంటి బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయాలని ఏ బౌలర్‌కైనా ఉంటుంది. అందులో ఒకరు ఇంగ్లాండ్‌ వెటరన్‌ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌. 2012లో ఇంగ్లాండ్‌ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా అతడు లిటిల్‌మాస్టర్‌ను పలుమార్లు ఔట్‌ చేశాడు. అందులో కీలకంగా చెప్పుకోవాల్సింది ముంబయిలోని వాంఖడేలో జరిగిన రెండో టెస్టు గురించి. ఆ మ్యాచ్‌లో పనేసర్‌ ఓ వైవిధ్యమైన బంతితో లిటిల్‌ మాస్టర్‌ను బోల్తాకొట్టించాడు. ఆ బంతిని సచిన్‌ సరిగ్గా అంచనా వేయలేకపోయాడని, దాంతో తన డెలివరీ వికెట్లను తాకుతూ బెల్స్‌ను ఎగరవేసిందని చెప్పాడు. తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన అతడు నాటి విశేషాల్ని నెమరువేసుకున్నాడు. 

తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఓటమిపాలయ్యాక ముంబయిలో రెండో టెస్టు జరిగింది. అప్పుడు పనేసర్‌కు ఇంగ్లాండ్‌ తుది జట్టులో అవకాశం ఇచ్చారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఈ ఇంగ్లిష్‌ స్పిన్నర్‌ రెచ్చిపోయాడు. ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ లైనప్‌ను దెబ్బతీశాడు. అప్పుడు సచిన్‌(8)కు బౌలింగ్‌ చేస్తుండగా తనలో పూర్తి ఆత్మవిశ్వాసం నెలకొందని చెప్పాడు. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉన్నట్లు అనిపించిందని తెలిపాడు. అప్పుడే తన వైవిధ్యమైన బౌలింగ్‌తో సచిన్‌ వికెట్‌ తీయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. ఆ సమయంలో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ చక్కగా కుదురుకున్నాడని, కానీ.. తన బంతిని అంచనా వేయడంలో బోల్తాపడ్డాడని పేర్కొన్నాడు. లెగ్‌స్టంప్‌ ఆవల పడిన బంతి వికెట్లకు తాకుంతుందని అంచనా వేయలేకపోయాడని గుర్తుచేసుకున్నాడు. మరోలా చెప్పాలంటే తాను వేసిన ఆ డెలివరీ ‘షేన్‌వార్న్‌ శతాబ్దపు బంతి’ కన్నా అత్యుత్తమైందని వ్యాఖ్యానించాడు. కాగా, అదే మ్యాచ్‌లో పనేసర్‌.. సెహ్వాగ్‌(30), కోహ్లీ(19), ధోనీ(29), రవిచంద్రన్‌ అశ్విన్‌(68)లను ఔట్‌ చేశాడు. దాంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్‌ 413 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 142 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లిష్‌ స్పిన్నర్‌ ఆరు వికెట్లతో చెలరేగాడు. చివరికి ఇంగ్లాండ్‌ పది వికెట్ల తేడాతో గెలుపొందింది. అనంతరం ఆ జట్టు 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని