కొవిడ్‌ టీకా త్వరగా ఇప్పిస్తామంటూ.. - Fake Calls In Bhopal offering early Covid Vaccine
close
Published : 30/12/2020 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ టీకా త్వరగా ఇప్పిస్తామంటూ..

వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ పేరుతో నకిలీ ఫోన్‌కాల్స్‌..


భోపాల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. తొలి విడత పంపిణీలో 30 కోట్ల మందికి టీకాను అందచేస్తామని.. వారిలో వైద్యారోగ్య సిబ్బందికి, కరోనా యోధులకు అనంతరం వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. ఐతే సైబర్‌ మోసగాళ్లు ఇదే అదనుగా ప్రజల్లో కొవిడ్‌పై భయాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. కొవిడ్‌ టీకా త్వరగా ఇప్పిస్తామని, అందుకు కొంత మొత్తం చెల్లించి తమ పేరు నమోదు చేయించుకోవాలని ఫోన్లు చేస్తున్నారు. ఈ మాదిరి ఆరు ఫిర్యాదులను నమోదు చేసుకున్న మధ్యప్రదేశ్‌ పోలీసులు విచారణ చేపట్టారు.

ఓటీపీ నంబర్లు వస్తాయంటూ..

తాము ప్రభుత్వ ఏజంట్లమని, ప్రభుత్వ సంస్థల నుంచి మాట్లాడుతున్నామని మోసగాళ్లు చెపుతున్నారు. వ్యాక్సిన్‌ తయారీ, సరఫరా వ్యవస్థలలో తాము భాగమని.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకునేందుకు తాము తెలిపిన బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేయాల్సిందిగా కోరుతున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కంటే ముందుగానే టీకా ఇప్పించగలమని హామీ ఇస్తున్నారు. ఇందుకు గాను రూ.500 నుంచి రూ.5 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. వారి మాటలను బాధితులు నమ్మేందుకు డబ్బు సదరు ఖాతాల్లో జమ అయిన తర్వాత వారికి  ఓటీపీ నంబర్లు కూడా వస్తాయని నమ్మబలుకుతున్నారు.

భోపాల్‌ ప్రజలు ఈ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఓ కాలేజీ విద్యార్థి, మరి కొన్ని కుటుంబాలకు ఇటువంటి ఫోన్‌కాల్స్‌ వచ్చినట్టు సమాచారం. వారిలో ఇప్పటికే కొవిడ్‌ సోకిన వారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు భోపాల్‌ పోలీస్‌ సైబర్‌ విభాగంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విధమైన నకిలీ ఫోన్‌కాల్స్‌ అధికంగా జార్ఖండ్‌, హరియాణా, రాజస్తాన్‌‌ ప్రాంతం నుంచి వస్తున్నాయని పోలీసులు అంటున్నారు.

హెచ్చరించిన ఇంటర్‌పోల్‌‌

ఈ సైబర్‌ కేటుగాళ్ల ఫోన్‌ కాల్స్‌ వల్ల తమ పరిధిలో ఇప్పటి వరకు ఎవరూ మోసపోలేదని.. ఐతే, ఈ విధమైన నేరాలు సమీప భవిష్యత్తులో పెరిగే ప్రమాదం ఉందని మధ్యప్రదేశ్‌ పోలీసులు అంటున్నారు. ఇదిలా ఉండగా కొవిడ్‌, ఫ్లూ వ్యాక్సిన్లకు సంబంధించి తప్పుడు సమాచారం, నకిలీ ప్రకటనలు, చట్టవిరుద్ధమైన వాగ్దానాలతో మోసాలు జరిగే అవకాశముందని అంతర్జాతీయ పోలీసు సంస్థ ‘ఇంటర్‌పోల్‌’.. తన 194 సభ్యదేశాలకు ఆరెంజ్‌ నోటీసు జారీచేసి హెచ్చరించటం గమనార్హం.

అంతేకాకుండా ప్రమాదకర స్థితిలో అత్యవసర చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగులను ఆదుకునేందుకు.. ఆర్థిక సాయం చేయాలని అందుకుగాను విరాళాలను బ్యాంకు ఖాతాల్లో వేయాలంటూ కోరుతున్న సంఘటనలకు సంబంధించిన కేసులు కూడా తమ వద్ద నమోదయ్యాయని మధ్యప్రదేశ్‌ పోలీసులు అంటున్నారు.

ఇవీ చదవండి..

వెలుగులోకి కొత్తరకం మోసం

యాప్‌తో గొలుసుకట్టు మోసంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని