కరోనాతో కంటిచూపు కోల్పోయిన బాలిక! - First case of Covid19 linked brain nerve damage
close
Published : 21/10/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో కంటిచూపు కోల్పోయిన బాలిక!

దిల్లీ: కరోనా మహమ్మారి ఊపిరితిత్తులతో పాటు మెదడుపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడిన వారిలో మెదడు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు తొలి సారిగా గుర్తించారు. మెదడులోని సున్నితపైన నాడీకణాలపైనా కరోనా వైరస్‌ దాడి చేయడం వల్ల ఓ 11 ఏళ్ల బాలిక కంటి చూపు కోల్పోయినట్లు దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. దేశంలోనే ఇది తొలి కేసు అయి ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. 

ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించిన వివరాల మేరకు.. కళ్లు సరిగ్గా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఓ చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ చేసిన వైద్యులు యాక్యూట్‌ డిమైలినేటింగ్‌ సిండ్రోమ్‌ (ఏడీఎస్‌) లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి కరోనా వైరస్‌ ప్రభావం మెదడుపైనా ఉందని నిర్ధారించారు. ఆమెకు కరోనా సోకినప్పటి నుంచి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొందన్న దానిపై ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తున్నట్లు చెప్పారు. సదరు బాలికకు కరోనా వైరస్‌ సోకక ముందు ఎలాంటి కంటి సమస్యలూ లేవని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఏడీఎస్‌ ప్రభావం వల్ల నాడీకణాల్లోని మెయిలిన్‌ తొడుగు నాశనమవుతుంది. దీనివల్ల మెదడు పంపించిన సంకేతాలు శరీరభాగాలకు సరిగా చేరక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని ఇమ్యూనోథెరపీ ద్వారా చికిత్స చేశామని వైద్యులు తెలిపారు. 50 శాతం చూపు తిరిగి వచ్చాక తాజాగా ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశామన్నారు. మరో 13 ఏళ్ల బాలికకు తీవ్ర జ్వరం, మెదడులో వాపు సమస్య ఉందని, ఆమెకు కూడా చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఆమె కూడా గతంలో కరోనా బారిన పడటంతో వైద్యులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని