నా మిత్రుడు రజనీకాంత్‌ ఇంటిని వదిలేస్తానా?  - Former IAS Joins Kamal Haasans Party
close
Published : 02/12/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా మిత్రుడు రజనీకాంత్‌ ఇంటిని వదిలేస్తానా? 

ఎన్నికల్లో సూపర్‌స్టార్‌ మద్దతు కోరతానన్న కమల్‌ హాసన్‌

చెన్నై: వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్ మద్దతు కోరతానని మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ తెలిపారు. రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్ల కోసం అందరి ఇళ్లకు వెళ్లాలని అనుకుంటున్నానన్న కమల్‌.. తన మిత్రుడు రజనీకాంత్‌ ఇంటిని వదిలేస్తానా? అంటూ వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్‌ అధికారి సంతోష్‌బాబు మంగళవారం చెన్నైలోని మక్కల్‌ నీది మయ్యం కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి కమల్‌ సాదరంగా ఆహ్వానించి పార్టీ సభ్యత్వం అందజేశారు. 

సినిమాల్లో మేం పోటీదార్లమే..

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ.. సినిమాల్లో తాను, రజనీ పోటీదార్లం మాత్రమేనని, ఒకరిపై ఒకరికి ఎప్పుడూ ఈర్ష్య, అసూయ లేవని స్పష్టంచేశారు. రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం కన్నా.. ఆయన ఆరోగ్యంపైనే తనకు ఎక్కువ మక్కువ ఉందన్నారు. తన విషయంలో మాత్రం తన వృత్తి కన్నా రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తితో ఉన్నట్టు చెప్పారు. పార్టీలో చేరిన సంతోష్‌ బాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కాగా, ఇటీవల రజనీకాంత్‌ తన అభిమానులతో సమావేశమైన సంగతి తెలిసిందే. తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేస్తానని ఈ సందర్భంగా రజనీ చెప్పారు. ఈ నేపథ్యంలో కమల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రైతుల పోరాటానికి మద్దతు

తమిళనాడులో దాదాపు 25 ఏళ్ల పాటు ఐఏఎస్‌ అధికారిగా సేవలందించిన సంతోష్‌బాబు వీఆర్‌ఎస్‌ తీసుకొని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంఎన్‌ఎంలో చేరారని కమల్‌ అన్నారు. ఇంకా ఎనిమిదేళ్ల సర్వీసు ఉంటుండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి కమల్‌ తన మద్దతు ప్రకటించారు. అన్నదాతల డిమాండ్లను ప్రభుత్వం వినాలని డిమాండ్‌ చేశారు. నివర్‌ తుపాను నేపథ్యంలో తమిళనాడులోని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై కమల్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని