మా కోసం ధోనీ అలా చేశాడు - Former head coach Gary Kirsten says Dhoni was very Loyal
close
Published : 16/07/2020 11:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా కోసం ధోనీ అలా చేశాడు

అతడెంతో నమ్మకమైన వ్యక్తి: గ్యారీ కిర్‌స్టెన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎంతో నమ్మకమైన వ్యక్తి అని, తాను టీమ్‌ఇండియా కోచ్‌గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేదని దక్షిణాఫ్రికా క్రికెటర్‌‌ గ్యారీ కిర్‌స్టెన్‌ చెప్పాడు. తాజాగా ‘ది ఆర్కే షో’లో మాట్లాడిన అతడు ధోనీ గురించి అలాగే 2011 ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఓ సంఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను కలిసిన వాళ్లలో అతడే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని, ఈ విషయం తాను ఎన్నోసార్లు చెప్పానన్నాడు. అలాగే ప్రజల దృష్టిలో మహీ గొప్ప సారథిగా నిలిచిపోయాడన్నాడు. 

‘‘ప్రపంచకప్‌కు ముందు నేను ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోను. టీమ్‌ఇండియా బెంగుళూరులో ఉన్నప్పుడు ఒక ఎయిర్‌ స్కూల్‌ను సందర్శించడానికి మాకు ఆహ్వానం అందింది. ఆ సమయంలో నాతోపాటు జట్టుతో పాడీ ఆప్టన్‌, ఎరిక్‌ సిమ్మన్స్‌ ఉన్నారు. మేం ముగ్గురం విదేశీయులైనందున భద్రతా కారణాల రిత్యా మమ్మల్ని అనుమతించబోమని చెప్పారు. అప్పటికే జట్టులోని ఆటగాళ్లంతా అక్కడికి వెళ్లడానికి సిద్ధమైపోయారు. మమ్మల్ని అనుమతించబోమని చెప్పడంతో ధోనీ ఆ మొత్తం పర్యటననే రద్దు చేశాడు. అప్పుడతను ఒకటే మాట చెప్పాడు. ‘వీళ్లు నా వాళ్లు. వాళ్లని అనుమతించకపోతే, మేం కూడా రావడం లేదు’ అని తేల్చిచెప్పాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు ధోనీ’’ అని కిర్‌స్టెన్‌ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 

ధోనీ తనతో ఎంతో నమ్మకంగా ఉండేవాడని మాజీ కోచ్‌ అభిప్రాయపడ్డాడు. తమ కాంబినేషన్‌లో ఎల్లప్పుడూ  విజయాలే సాధించలేదని, కొన్నిసార్లు కఠిన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నామని చెప్పాడు. జట్టును సరైన పద్ధతిలో నడిపించడానికి తరచూ మాట్లాడుకునేవాళ్లమని, అలా తమ ఇద్దరి మధ్యా బలమైన అనుబంధం ఏర్పడిందన్నాడు. కాగా, ధోనీ సారథ్యంలోని టీమ్‌ఇండియా 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచాక గ్యారీ కిర్‌స్టెన్‌ హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడి శిక్షణలో భారత్‌ టెస్టుల్లో నంబర్‌ వన్‌గా ఎదగడమే కాకుండా, 2011 వన్డే ప్రపంచకప్‌ సాధించింది. ఆ తర్వాత కిర్‌స్టెన్‌ టీమ్‌ఇండియా కోచ్‌గా తప్పుకున్న సంగతి తెలిసిందే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని