ఎమ్మెల్యే, ఎంపీలపై 2556 కేసులు..! - Former serving lawmakers facing trials in 4442 cases
close
Published : 09/09/2020 19:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎమ్మెల్యే, ఎంపీలపై 2556 కేసులు..!

4442 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ, సిట్టింగ్‌ సభ్యులు
సుప్రీంకోర్టు నివేదికలో వెల్లడి

దిల్లీ: రాజకీయాల్లో నేరచరిత్ర ఉన్న నాయకుల పాత్ర రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా వందల మంది నాయకులు నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. దేశంలో ప్రస్తుత చట్టసభ సభ్యులపైనే 2,556 పెండింగ్‌ కేసులు ఉన్నట్లు సుప్రీంకోర్టు తాజా నివేదిక వెల్లడించింది. గతంలో పనిచేసిన, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపై 4,442 నేరపూరిత కేసులు పెండింగులో ఉన్నట్లు అన్ని హైకోర్టులు సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నాయి. వీరిలో ఎక్కువగా అవినీతి, మనీలాండరింగ్ నిరోధక చట్టం‌, ఆయుధాల చట్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పరువునష్టం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలో తేలింది.

చట్టసభసభ్యులపై ఉన్న నేరారోపణల కేసులను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా పెండింగ్‌ కేసుల పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు కోరింది. పార్లమెంట్‌తోపాటు వివిధ రాష్ట్రాల చట్టసభ సభ్యులపై పెండింగులో ఉన్న కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని రాష్ట్రాల హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్‌లకు సూచించింది. తాజాగా అన్ని హైకోర్టుల నుంచి అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ సభ్యులపై నాలుగు వేలకుపైగా నేరపూరిత కేసులు పెండింగులో ఉన్నట్లు తేలింది. వీరిలో ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపైనే 2,556 కేసుల విచారణ పెండింగులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అమికస్‌ క్యూరీ (కోర్టు సహాయకులు)గా ఉన్న సీనియర్‌ న్యాయవాది సుప్రీంకోర్టుకు అందించిన అఫిడవిట్‌లో ఈ వివరాలు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుత చట్టసభ సభ్యులపై 2,556 కేసులు ఉండగా.. వీరిలో కొందరిపై ఒకటికంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 413 జీవిత ఖైదుకు సంబంధమున్న కేసులే ఉండగా, వీటిలో 174మంది ప్రస్తుత చట్టసభ సభ్యులే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో 352 కేసుల విచారణపై ఆయా రాష్ట్రాల హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు స్టే విధించినట్లు నివేదిక పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ నాయకులపైనే ఎక్కువ కేసులు..!

నాయకులపై ఉన్న కేసుల్లో ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని చట్టసభ సభ్యులపైనే ఉన్నట్లు తేలింది. అక్కడి నాయకులపై 1217 కేసులు ఉండగా, వీటిలో 446 ప్రస్తుత చట్టసభ సభ్యులపై ఉండటం గమనార్హం. యూపీ తర్వాత బిహార్‌ చట్టసభ సభ్యులపైనే ఎక్కువ కేసులు ఉన్నాయి. ఇక్కడ 531కేసులు ఉండగా, వీరిలో 256 ప్రస్తుత సభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. వీటిని త్వరగా విచారణ చేపట్టడంలో భాగంగా ఎమ్మెల్యే/ఎంపీల కేసులను విచారించేందుకు ప్రతి జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అమికస్‌ క్యూరీ సూచించారు. అంతేకాకుండా ప్రతి హైకోర్టు ఈ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని