close

తాజా వార్తలు

గొల్లపూడి: రేడియో టు సినిమా టు టీవీ!

గొల్లపూడి జీవిత ప్రస్థానమిదే..!

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో నటించి నాలుగు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు మారుతీరావు. రేడియోతో మొదలుపెట్టి సినిమాల్లో తనదైన శైలిలో రాణించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించిన గొల్లపూడి సంబంధించిన జీవిత విశేషాలు.

ప్రేక్షకులకు నటుడిగానే సుపరిచిమైనా... గొల్లపూడి మారుతీరావు ఒక సుప్రసిద్ధ రచయిత. సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 


రేడియోతో మొదలు పెట్టి..

తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. 


విద్యార్థి దశలో నాటకాలు..

చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ‘ఆడది’, ‘కుక్కపిల్ల దొరికింది’, ‘స్వయంవరం’, ‘రిహార్సల్స్’, ‘వాపస్’, ‘మహానుభావాలు’ లాంటి నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు.. ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే ‘స్నానాలగది’, ‘మనస్తత్వాలు’ నాటకంలోనూ అభినయించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకమైన ‘వందేమాతరం’ని రచించి చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా, వచ్చిన రూ. 50 వేలు నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పి.వి.నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959 డిసెంబరు 16న ‘రాగరాగిణి’ అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత ‘పథర్‌ కే అన్సూ’ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. 


చిరంజీవి సినిమాతో సినీ రంగంలోకి..

చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. 1963లో ‘డాక్టర్‌ చక్రవర్తి’ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు గొల్లపూడి. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ తర్వాత నటుడిగా కూడా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకిపైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘స్వాతిముత్యం’, ‘తరంగిణి’, ‘త్రిశూలం’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘ముద్దుల ప్రియుడు’, ‘ఆదిత్య 369’ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.


కుమారుడి జ్ఞాపకంగా అవార్డు..

ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకి సంబంధించిన జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్‌ పరిశీలన విభాగంలో పనిచేశారు. మారుతీరావు వివాహం 1961 నవంబరు 11న శివకామసుందరితో హనుమకొండలో జరిగింది. ఈ దంపతులకి ముగ్గురు మగసంతానం. పెద్ద కుమారులు సుబ్బారావు, రామకృష్ణ మారుతీ ఎయిర్‌ లింక్స్‌ అనే ట్రావెల్‌ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్‌ 1992 ఆగస్టు 12న మరణించారు. తన తొలి ప్రయత్నంగా ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ, చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. మారుతిరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్‌ జాతీయ అవార్డుని నెలకొల్పారు. ఉత్తమ నూతన దర్శకుడికి రూ.1.50 లక్షలు నగదు బహుమతినీ, ప్రముఖ చిత్ర కారుడు బాపు రూపొందించిన బంగారపు జ్ఞాపికనూ ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించి విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా రూ.15 వేలు గొల్లపూడి మెమోరియల్‌ లెక్చర్‌ పేరిట బహుమానం అందిస్తున్నారు. సునీల్‌దత్, నసీరుద్దీన్‌ షా, మృణాల్‌ సేన్, శ్యాంబెనగల్, జావెద్‌ అక్తర్, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు ఇందులో ప్రసంగించిన ప్రముఖుల్లో ఉన్నారు. 


ఈటీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా..

సినీ రచయితగా నాలుగు నంది పురస్కారాలు సొంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావుకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కళారత్నతో పాటు మరెన్నో విశిష్ట పురస్కారాలు లభించాయి. ఈటీవీ ‘ప్రతిధ్వని’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన గొల్లపూడి మారుతీరావు పలువురు ప్రముఖుల్ని ఇంటర్య్వూ చేశారు. ‘మనసున మనసై’, ‘ప్రజావేదిక’, ‘సినీ సౌరభాలు’ తదితర కార్యక్రమాలకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ‘ఇంటింటి రామాయణం’, ‘గణపతి’, ‘ఎవరి గోల వారిదే’, ‘ప్రేమలు పెళ్ళిళ్ళు’, ‘భార్యా రూపవతీ’, ‘శత్రు’, ‘ఏది నిజం?’ తదితర ధారావాహికల్లో నటుడిగా కూడా మెప్పించారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.