
తాజా వార్తలు
అభిమానులకు తలైవా తీపికబురు
చెన్నై: తాజాగా రాజకీయ ప్రవేశం గురించి ఆసక్తికరమైన వార్త చెప్పిన సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అభిమానులకూ ఓ తీపి కబురు చెప్పారు. ప్రస్తుతం రజనీకాంత్ నటించాల్సిన ‘అన్నాతె’ కరోనా మహమ్మారి వల్ల నిలిచిపోయింది. అయితే.. ఇదిలా ఉండగానే.. ఆయన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేశారు. దీంతో ఇప్పట్లో రజనీ సినిమాల్లో కనిపిస్తారో లేదో అని కాస్త ఆవేదనకు గురయ్యారు అభిమానులు. కాగా.. ‘అన్నాతె’ చిత్రీకరణలో జనవరిలో పాల్గొంటానని ప్రకటించాడు తలైవా. ఈ ఏడాది ప్రారంభంలో రామోజీఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఈ సినిమా లాక్డౌన్ వల్ల ఆగిపోయింది.
సినిమాలో తనకు సంబందించిన చిత్రీకరణ ఇంకా 40శాతం మిగిలి ఉందని, దాన్ని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. సినిమా తర్వాతి షెడ్యుల్‌ను రామోజీఫిల్మ్సిటీలోనే చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ గ్రామ సర్పంచ్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఒక పల్లెటూరు నమూనాలో సెట్ ఏర్పాటు చేశారట. రజనీకి 168వ చిత్రమైన ‘అన్నాతె’కు ‘విశ్వాసం’ డైరెక్టర్ సిరుతయి శివ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. ప్రకాశ్‌రాజ్, ఖుష్భూ, మీనా కీలకపాత్రల్లో కనిపించనున్నారు.