మైండ్‌ఫుల్ బ్రౌజింగ్ మరింత సులభంగా.. - Here Are Top Extensions To Block Digital Distraction
close
Updated : 11/11/2020 11:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మైండ్‌ఫుల్ బ్రౌజింగ్ మరింత సులభంగా..

ఇంటర్నెట్‌డెస్క్‌: కంప్యూటర్‌లో ఆఫీస్‌ వర్క్ చేస్తూ బిజీగా ఉంటాం.. అంతలో డెస్క్‌టాప్‌పై మెయిల్ నోటిఫికేషన్‌ వస్తుంది. చేస్తున్న పని ఆపేసి వెంటనే మెయిల్ ఓపెన్‌ చేస్తాం. ముఖ్యమైనదయితే రిప్లై ఇచ్చి మళ్లీ పనిలో నిమగ్నమవుతాం. అయితే ఇలా పని మధ్యలో వచ్చే మెయిల్‌ నోటిఫికేషన్స్‌ వల్ల 20 నిమిషాల సమయం వృథా అవుతుందని ఒక పరిశోధనలో తేలిందట. ఎలాగంటే..మెయిల్‌ చూసిన తర్వాత చాలా మంది తిరిగి పనిపై దృష్టి సారించకుండా మధ్యలో ఫేస్‌బుక్‌, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి చేస్తున్నారట. దీని వల్ల చేస్తున్న పని ఆలస్యమవడమే కాకుండా విలువైన సమయం వృథా అవుతోందట. ముఖ్యంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసే వారిలో ఎక్కువగా ఈ సమస్యను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. దీనినే డిజిటల్ డిస్ట్రాక్షన్‌ అంటారు. అంటే చేస్తున్న పని మధ్యలో ఎస్సెమ్మెస్‌ కోసమో, మెయిల్ కోసమో లేదా సోషల్ మీడియా కోసమో చూసిన ప్రతిసారీ చేస్తున్న పనిపై ఏకాగ్రత తగ్గిపోతుంది. మరి ఈ డిజిటల్‌ డిస్ట్రాక్షన్‌ను తొలగించి పనిపై దృష్టి పెట్టేందుకు ఉన్న ప్రత్యామ్నాయం..బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్స్‌. మరి అవేంటో..ఎలా పనిచేస్తాయో..ఎంత మేర మనల్ని డిజిటల్‌ డిస్ట్రాక్షన్‌ నుంచి కాపాడతాయో ఒక్కసారి చూద్దామా..


అన్‌వెబ్ (Unweb)

ఏదైనా వెబ్‌సైట్‌లో బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు అందులో వచ్చే యాడ్స్‌ డిస్ట్రబ్‌ చేయకుండా ఉండేందుకు యాడ్‌ బ్లాకర్స్‌ని ఉపయోగిస్తుంటాం. కానీ ఇటీవలి కాలంలో రికమెండెడ్ వీడియోస్‌, న్యూ ఫీడ్‌ అంటూ మిమ్మల్ని ఎక్కువ సేపు సదరు వెబ్‌సైట్‌లో బ్రౌజ్‌ చేసేలా చేస్తున్నారు. ఇలాంటి నోటిఫికేషన్స్‌ని కూడా అన్‌వెబ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌, బీబీసీ, బచ్‌ఫీడ్, అమెజాన్‌ లాంటి 19 పాపులర్‌ సైట్లలో ఇది పని చేస్తుంది. ఒక వేళ మీరు ఇంకా వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలనుంటే అన్‌వెబ్ డెవలపర్‌కి మెసేజ్ పెడితే సరిపోతుంది.


గ్రేస్కేల్‌ ది వెబ్‌ (Grayscale The Web)

డిజిటల్‌ డిస్ట్రాక్షన్‌లో కలర్‌ కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వెబ్‌ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన రంగులు, సౌండ్స్‌తో యూజర్స్‌ని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటాయి పలు వెబ్‌సైట్లు. అందుకే మనం బ్రౌజ్‌ చేసే వెబ్‌ పేజీలను బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగులోకి మారిస్తే డిజిటల్ డిస్ట్రాక్షన్‌ తగ్గుతుందనేది ప్రొడక్టివిటీ నిపుణుల మాట. ఇందుకోసం రూపొందించిందే గ్రేస్కేల్ ది వెబ్‌ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఫర్ దిస్ ట్యాబ్, ఫర్ ఆల్ సైట్స్‌ అని రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో ట్యాబ్‌ సెలెక్ట్ చేసుకుంటే మీరు బ్రౌజ్‌ చేస్తున్న వెబ్ పేజీ మొత్తం బ్లాక్‌ అండ్ వైట్‌లోకి మారిపోతుంది. అలా కాకుండా సైట్స్‌ అనేది సెలెక్ట్ చేస్తే మీరు ఓపెన్ చేసే ప్రతి వెబ్‌సైట్‌ బ్లాక్‌ అండ్ వైట్ రంగులో మీకు కనిపిస్తుంది. కొన్ని బ్రౌజర్‌ కంపెనీలు ఈ ఎక్స్‌టెక్షన్‌ను ప్రయత్నించగా చక్కని ఫలితాలనిచ్చాయట.


ఇంటెన్షన్ (Intention)

ఇది మీ బ్రౌజర్‌ హిస్టరీ ఆధారంగా మీరు ఎక్కువగా చూసే వెబ్‌సైట్లను యువర్ టాప్ సైట్స్‌ పేరుతో చూపిస్తుంది. ఒక వేళ టాప్‌ సైట్స్‌ జాబితాలో లేని వెబ్‌సైట్లను మీరు ఓపెన్ చేస్తే దాన్ని అన్‌లాక్‌ చేసేందుకు టైం లిమిట్ అడుగుతుంది. బ్రౌజింగ్ ప్రారంభించగానే ఇంకా ఎంత టైం మిగిలిఉందనేది పాప్‌-మెసేజ్‌లో చూపిస్తుంది. అలానే మీరు తరచుగా చూసే వెబ్‌సైట్ టాప్‌లో లేకుంటే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఇంటెన్షన్‌లో ఉన్న ఆప్షన్స్‌లో మీరు కారణం టైప్‌ చేస్తే దాన్ని మీ రోజువారీ జాబితాలో చూపిస్తుంది. అలా మీ ఏకాగ్రతను దెబ్బతీసే వెబ్‌సైట్లను బ్లాక్ చెయ్యొచ్చు.


ట్యాబ్‌ లిమిటర్‌ (Tab Limiter)

సోషల్ మీడియా వెబ్‌సైట్లతో పాటు ఇతర షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్లు డిజిటల్ డిస్ట్రాక్షన్‌కి ముఖ్య కారణం. చేస్తున్న పని మీద ఏకాగ్రత కోల్పోకుండా సోషల్ మీడియా వంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే ఎంతో విల్‌పవర్‌ (సంకల్పశక్తి) కావాలి. ట్యాబ్‌ లిమిటర్‌ ఎక్స్‌టెన్షన్ మీ విల్‌పవర్ లాంటిదే. ఈ ఎక్సటెన్షన్ సహాయంతో మీరు బ్రౌజింగ్ చేసేప్పుడు ఎన్ని ట్యాబ్స్‌ ఓపెన్ అయి ఉండాలనేది నిర్ణయించుకోవచ్చు. ఒక వేళ పరిమితి దాటి మీరు ట్యాబ్‌లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే మీరు ట్యాబ్‌ లిమిట్ సెట్ చేశారు అనే పాప్‌-అప్‌ మెసేజ్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. 


మైండ్‌ఫుల్ ఇంటర్నెట్ యూజ్‌ (Mindful Internet Use)

మీరు చేస్తున్న పని కొంచెం ఒత్తిడిగా అనిపించి చిన్న బ్రేక్ తీసుకుందామని ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి బ్రౌజింగ్ చేయడం ప్రారంభించారు. అలా  20 నిమిషాలు సమయం గడిపారు. తర్వాత టైం చూసుకుని అయ్యో అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైండ్‌ఫుల్ ఇంటర్నెట్ యూజ్‌ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాగంటారా..? మీరు ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మైండ్‌ఫుల్ బ్రౌజింగ్‌ చేసేందుకు మిమ్మల్ని పోత్సహిస్తుంది. ముందుగా కొన్ని నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ చేయమని సూచిస్తుంది. తర్వాత స్ఫూర్తివంతమైన సందేశాలను స్క్రీన్ మీద చూపిస్తుంది. తర్వాత కూడా మీరు బ్రౌజింగ్ చేయాలనుకుంటే టైం లిమిట్‌తో బ్రౌజింగ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. టైం లిమిట్ తర్వాత ఆటోమేటిగ్గా సదరు వెబ్‌ పేజీని మూసేస్తుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని