
తాజా వార్తలు
ఎన్టీఆర్ ‘కొమురం భీమ్’ రికార్డుల వేట
ఇంటర్నెట్ డెస్క్: జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెంచాయి. అందులో ముఖ్యంగా ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో విడుదల చేసిన కొమురం భీమ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ తెలుగులో ఏ సినిమాకు సాధ్యం కానన్ని లైకులు సొంతం చేసుకుంది. అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొమురం భీమ్ టీజర్‌కు ఇప్పటి వరకూ 3.3కోట్ల వీక్షణలు వచ్చాయి. టీజర్‌ను చూసిన వారిలో 12 లక్షల మంది లైక్ కొట్టారు. ఇన్ని లైకులు రావడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి.
మరోవైపు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో మార్చి 27న వచ్చిన రామరాజు టీజర్ 8.29 లక్షల లైకులు సొంతం చేసుకుంది. ఈ టీజర్‌కు 3.6కోట్ల వీక్షణలు రావడం గమనార్హం. ఇలా మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ తెలుగులో అగ్రస్థానంలో నిలవగా జాతీయ స్థాయిలో మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మాస్టర్-2.3మిలియన్లు, రెండోస్థానంలో సర్కార్- 1.4మిలియన్లు, మూడో స్థానంలో మెర్సల్-1.2మిలియన్లు(కొమురం భీమ్‌తో సమానంగా), సాహో-1.1 మిలియన్ల లైకులు సాధించాయి. అయితే.. తొలి రెండు స్థానాల్లోనూ తమిళ హీరో విజయ్ సినిమాలు ఉండటం గమనార్హం. కాగా.. తెలుగులో తొలి రెండు స్థానాల్లో కొమురం భీమ్, రామరాజు టీజర్లు ఉండగా.. మూడో స్థానంలో భరత్ అనే నేను-6.60లక్షలు, అల వైకుంఠ పురములో-6.36లక్షలు, సాహో(తెలుగు)-6.06లక్షల లైకులు సాధించాయి.
చారిత్రక పాత్రలకు ఫిక్షనల్ స్టోరీ జోడించి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. కాగా.. చరణ్‌కు జోడీగా అలియాభట్, తారక్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఓలివియా మోరిస్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో సుదీర్ఘ షెడ్యూల్ పూర్తి చేసుకొన్న చిత్రంబృందం ఇటీవలే పుణెకు వెళ్లినట్లు సమాచారం.
ఇవీ చదవండి
RRR:యాక్షన్ సీక్వెన్స్ పూర్తి.. పుణెకు పయనం?