వేడిని తట్టుకోగల కరోనా టీకా.. - IISc researchers to develop heat tolerant corona vaccine
close
Updated : 11/11/2020 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేడిని తట్టుకోగల కరోనా టీకా..

ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

దిల్లీ: అంతర్జాతీయంగా కొవిడ్‌-19 కేసులు ఇప్పటికే ఐదుకోట్ల మార్కును దాటాయి. ప్రపంచమంతా కరోనా వైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని ఎదురుచూస్తోంది. చైనా ఇప్పటికే తమ దేశంలో టీకా పంపిణీ చేస్తుండగా.. రష్యా మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ వైపు దూసుకుపోతోంది. అసలు కొవిడ్‌ టీకా ఆవిష్కరణ ఒక ఎత్తు కాగా.. దాని సక్రమ పంపిణీ మరో ఎత్తు. కోట్లాది ప్రజలకు అతి శీతల పరిస్థితిలో టీకాలను సరఫరా చేయటం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థల ముందున్న పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్తల పరిశోధన ఆశాజనకంగా ఉంది.

37 డిగ్రీ సెల్సియస్‌లో కూడా

ఐఐఎస్‌సీ మాలిక్యులర్‌ బయో ఫిజిక్స్‌ యూనిట్‌కు చెందిన శాస్త్రవేత్త రాఘవన్‌ వరదరాజన్‌ ఈ పరిశోధనకు సారథ్యం వహించారు. వేడిని తట్టుకుని మనగలిగే కొవిడ్-19 టీకాను ఈ బృందం రూపొందించారు. ఈ పరిశోధన వివరాలను జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ కెమిస్ట్రీలో ప్రచురించారు. సాధారణంగా కరోనా వ్యాక్సిన్లు మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పనిచేయగా.. తమ వ్యాక్సిన్‌ 37 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతను కూడా సమర్థవంతంగా తట్టుకుందని పరిశోధకులు వివరించారు. మరింత అభివృద్ధి చేసిన అనంతరం ఇది 100 డిగ్రీల సెల్సియస్‌ను కూడా తట్టుకోగలదని వారు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించే ముందు ఎలుకలు తదితర జంతువులపై ప్రయోగిస్తామని చెప్పారు. క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు సుమారు రూ.10 కోట్లు మేరకు నిధులు అవసరమని.. ఇందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని రాఘవన్‌ కోరారు.

ఇతర వ్యాక్సిన్లకు విభిన్నం

తమ వ్యాక్సిన్‌ అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ప్రభావవంతంగా పనిచేసిందని..  గినియా పిగ్‌లపై దీనిని ప్రయోగించినప్పుడు వాటి రోగనిరోధకత మరింత దృఢమైందని ఐఐఎస్‌సీ శాస్త్రవేత్తలు వివరించారు. ఇప్పటికే తయారవుతున్న ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా పూర్తి స్పైక్‌ ప్రొటీన్‌ను కాకుండా.. తమ వ్యాక్సిన్‌ దానిలో కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తుందని వారు వివరించారు. జీవ కణాలకు అంటుకునే తత్వమున్న స్పైక్‌ ప్రొటీన్‌.. కొవిడ్‌ వైరస్‌ శరీర కణం లోపలికి ప్రవేశించేందుకు దోహదం చేస్తుందనే సంగతి తెలిసిందే.

భారత్‌తో సహా పలు దేశాలకు వరం

అతి ఖరీదైన శీతలీకరణ విధానం అవసరం లేకుండానే వ్యాక్సిన్‌ పంపిణీకి దోహదం చేసే తమ విధానం.. అల్పాదాయ, వెనుకబడిన దేశాలకు వరమని శాస్త్రవేత్త రాఘవన్‌ వరదరాజన్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో పంపిణీకి తాము కనుగొన్న వ్యాక్సిన్‌ అత్యంత అనువైనదన్నారు.  కొత్తగా వస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లతో పోలిస్తే తమ ప్రొటీన్‌ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారుచేయటం సులభమని.. భారత్‌లో దశాబ్దాల తరబడి ఇదేవిధమైన వ్యాక్సిన్లను తయారుచేస్తున్నారన్నారు. తద్వారా ఇది భారత్‌కు కూడా ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరమని ఆయన వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని