అప్పుడు నా కెరీర్‌ ఏమవుతుందో అని భయపడ్డా.. - Imam ul haq says he scored 890 runs when his uncle Inzamam Ul Haq became chief selector for PCB
close
Published : 25/07/2020 21:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు నా కెరీర్‌ ఏమవుతుందో అని భయపడ్డా..

నెపోటిజమ్‌పై స్పందించిన ఇమామ్‌ ఉల్‌ హక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవాళీ క్రికెట్‌లో తాను అద్భుతంగా రాణిస్తున్న సమయంలోనే తన మామ, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు  మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌ అయ్యాడని ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ చెప్పాడు. మొదట్లో తాను జాతీయ జట్టుకు ఎంపికైనప్పుడు బంధుప్రీతి వల్లే ఆ స్థాయికి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయని తెలిపాడు. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ దీప్‌దాస్‌ గుప్తాతో తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఇమామ్‌.. తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిన్నప్పుడు అతడికి క్రికెట్‌ కన్నా ఎక్కువ మోడలింగ్‌, బ్యాడ్మింటన్‌ మీద ఇష్టం ఉండేదా అని వ్యాఖ్యాత అడగ్గా అలా ఏం లేదన్నాడు. తన సోదరుడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ అవడంతో అతడిని చూసి క్రికెట్‌పై ఆసక్తి పెరిగిందన్నాడు. మొదట్లో ఆట అర్థమయ్యేది కాదని, మెల్లిగా స్కూల్‌ క్రికెట్‌లో ఆడటంతో క్రికెట్‌పై ఇష్టం పెరిగిందన్నాడు. అలాగే తాను పాఠశాలలో బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌ కూడా ఆడానని చెప్పాడు. ఇక స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మోడలింగ్‌ చేసేవాడినని వివరించాడు. 

అనంతరం పాక్‌ దిగ్గజ క్రికెటర్‌ ఇంజమామ్‌తో తనని పోల్చడాన్ని ఎలా రిసీవ్‌ చేసుకున్నావని అడగ్గా.. తొలుత తాను ఎలా జాతీయ జట్టుకు ఎలా ఎంపికయ్యాడో వివరించాడు. తన మామ పీసీబీ చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపికైనప్పుడే తాను దేశవాళి క్రికెట్‌లో 890 పరుగులు చేశానని, అలా తన బ్యాటింగ్‌ నైపుణ్యం చూసి అప్పటి పాక్‌ కోచ్‌ మిక్కీ ఆర్థర్‌ ప్రోత్సహించాడని చెప్పాడు. అప్పుడు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో మంచి ప్రదర్శన చేయడంతో పాక్‌ జాతీయ జట్టుకు ఎంపికైనట్లు వెల్లడించాడు. కాగా, అదే రోజు సామాజిక మాధ్యమాల్లో తనపై  ఆరోపణలు వచ్చాయని, అవి తనని చాలా బాధపెట్టాయని పేర్కొన్నాడు. యూఏఈలో శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పుడు చాలా ఆందోళన చెందినట్లు వెల్లడించాడు. అప్పుడు తన ఫోన్లు కూడా మేనేజర్‌కే ఇచ్చానని, ఇంట్లో వాళ్లతో మాట్లాడకుండా, జట్టులోనూ ఒంటరిగా గడిపానన్నాడు. 

‘ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకముందే ఇలా అంటున్నారు. ఒకవేళ ఆడాక నిజంగా విఫలమైతే నా పరిస్థితేంటని భయపడ్డా, అలా జరిగితే ఇక అక్కడితో నా కెరీర్‌ ఆగిపోతుందని భావించా. ఒక్కోసారి బాత్‌రూమ్‌లో షవర్‌ కింద గంటలకొద్దీ ఏడ్చేవాడిని. ఇక లంకతో తొలి రెండు వన్డేలకు నన్ను ఎంపిక చేయలేదు. మూడో మ్యాచ్‌కు నన్ను ఎంపిక చేశారు కానీ తుది జట్టులో ఉంటానో లేదో చెప్పలేదు. మ్యాచ్‌ రోజు ఉదయం మిక్కీ ఆర్థర్‌ మెసేజ్‌ చేసి తుది జట్టులో ఆడుతున్నానని, అందుకు గుడ్‌లక్‌ కూడా చెప్పాడు. దాంతో నాకేం అర్థం కాలేదు. మైండ్‌ అంతా బ్లాంక్‌ అయిపోయింది. నన్ను ఎందుకు ఎంపిక చేశారో అనుకున్నా. అంతలా నా ఆత్మవిశ్వాసం దెబ్బతినింది. అప్పుడు నేను మ్యాచ్‌ గురించి ఆలోచించకుండా, మ్యాచ్‌ తర్వాత జరిగే పరిణామాల గురించే ఆందోళన చెందా. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే ఏం జరుగుతుందో అనే విషయమే నా బుర్రలో తిరిగింది. నా కెరీర్‌ ఆగిపోతుందని, మీడియా మొత్తం నాపై వేలెత్తి చూపిస్తుందని భయపడ్డా’ అని ఇమామ్‌ తన తొలి మ్యాచ్‌ నాటి విశేషాల్ని పంచుకున్నాడు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని