‘ఇమ్రాన్‌ పాలన నియంతల కంటే దారుణం’ - Imran administration is worse than dictators
close
Published : 19/10/2020 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఇమ్రాన్‌ పాలన నియంతల కంటే దారుణం’

పాక్‌లో ఉద్ధృతమవుతున్న విపక్ష కూటమి ఉద్యమం!

కరాచీ: పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘పాకిస్థాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్’‌(పీడీఎం) తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఆదివారం కరాచీలోని భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలందరూ ఒకే వేదికపై నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అత్యంత అసమర్థుడని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా అతనికి సమాచారం ఉండడం లేదని ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ’ అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ ఆరోపించారు. పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కలిసిపోయారని ఈ కీలుబొమ్మ ప్రభుత్వం ఏం చేయగలదని ప్రశ్నించారు. తాము చేస్తున్నది నిర్ణయాత్మక పోరని తెలిపారు. 2007లో జరిగిన జంట పేలుళ్లలో మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో మరణించి నిన్నటికి 13 సంవత్సరాలు గడిచింది. అందుకు గుర్తుగానూ ఈ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, అనారోగ్య కారణాలతో లండన్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూతరు మరియం నవాజ్‌ ఈ ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. తన తండ్రి, తన పార్టీ మద్దతుదారులను ఇమ్రాన్‌ దోశద్రోహులుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌ జాతిపితగా పిలుచుకునే మహమ్మద్‌ అలీ జిన్నా సోదరి ఫాతిమా జిన్నాను సైతం దేశవ్యతిరేకులుగా అభివర్ణించడం ఇమ్రాన్‌కే చెల్లించదని విమర్శించారు. తన తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికే ఇమ్రాన్‌ సైన్యాన్ని అడ్డం పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.

పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా గత నెల 20న 11 విపక్ష పార్టీలు కలిసి పీడీఎం పేరిట ఒకే వేదికపైకి వచ్చాయి. జనవరిలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి తరలివచ్చే మద్దతుదారులతో ఇస్లామాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి సన్నాహకంగా ప్రస్తుతం వివిధ నగరాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లాహోర్‌ శుక్రవారం తొలి ర్యాలీ నిర్వహించగా.. ఆదివారం కరాచీలో జరిగింది రెండోది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని