ఐరాసలో పాక్‌పై నిప్పులు చెరిగిన భారత్‌ - India Shreds Pak At Uniter Nations
close
Published : 16/09/2020 14:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐరాసలో పాక్‌పై నిప్పులు చెరిగిన భారత్‌

అది నిజమని పాక్‌ ప్రధానే ఒప్పుకున్నారు..

జెనీవా: ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 45వ సమావేశంలో పాక్‌ చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. మైనారిటీలను నిరంతరం అణచివేతకు గురిచేసే పాకిస్తాన్‌ మానవ హక్కులపై ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు సిద్ధంగా లేమని అంతర్జాతీయ వేదికపై భారత్‌ స్పష్టం చేసింది. పాక్‌ ఉగ్రవాదానికి కేంద్ర బిందువని.. పలువురికి ఉగ్రవాద శిక్షణ ఇచ్చినట్టు ఆ దేశ ప్రధానమంత్రే స్వయంగా అంగీకరించారని తేల్చిచెప్పింది.

మేమే కాదు ఏ దేశం సిద్ధంగా లేదు..

‘‘భౌగోళిక, మతపరమైన మైనారిటీలను అణచివేతకు గురిచేసే దేశం నుంచి మానవ హక్కులకు సంబంధించిన ఉపన్యాసాలు వినేందుకు భారత్‌ మాత్రమే కాకుండా, ఏ దేశం సిద్ధంగా లేదు. ఐక్యరాజ్యసమితి నిందితుల జాబితాలో ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేయటం పాక్‌కే చెల్లింది. జమ్ముకశ్మీరులో వేలాది మందికి తీవ్రవాద శిక్షణ నిచ్చామని గర్వంగా చెప్పుకున్న ప్రధాని ఉన్న దేశం అది. మానవ హక్కుల అమలులో దారుణంగా విఫలమైన ఆ దేశం, అంతర్జాతీయ సమాజం కన్ను కప్పేందుకు భారత అంతర్గత వ్యవహారాలపై ఆరోపణలు సాగిస్తోంది’’ అని భారత ప్రతినిధి స్పష్టం చేశారు.

ఒక్క కుటుంబం కానీ, ఒక్క రోజు కానీ లేదు

పాక్‌ దుర్మార్గాలను వివరిస్తూ ‘‘భారత్‌లో అంతర్భాతమైన జమ్ము-కశ్మీర్‌, లద్దాఖ్‌లలోని పాక్‌ ఆక్రమించిన ప్రాంతాల్లో స్థానిక కశ్మీరు ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భారీగా ప్రవేశిస్తున్న పరాయి వారి వల్ల వేలాది సంఖ్యలో సిక్కు, హిందూ, క్రిస్టియన్‌ మైనారిటీలకు చెందిన మహిళలు, యువతులు అపహరణలకు, బలవంతపు వివాహం, మతమార్పిడులకు గురౌతున్నారు. ఇక ఆ దేశంలోని బలూచిస్తాన్‌ ప్రాంతంలో పాక్‌ భద్రతా దళాల అపహరణకు గురి కాని కుటుంబం ఒక్కటి కూడా లేదు. ఆ కుటుంబాలలో ఎవరో ఒకరిని పాక్‌ సైన్యం మాయం చేయని రోజు లేదు’’ అని భారత్‌ వివరించింది.

టర్కీకి హితవు

భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోవటం మాని, ప్రజాస్వామిక విధానాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని టర్కీకి భారత్‌ సూచించింది. అంతేకాకుండా పాకిస్తాన్‌ చేతిలో కీలుబొమ్మగా మారిన ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఒఐసీ) వాఖ్యలను తాము ఖాతరు చేయబోమని భారత ప్రతినిధులు స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం నిలిపివేత, తీవ్రవాద చర్యల కట్టడిలో పాక్‌ వైఫల్యం పట్ల ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయని వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని