ఏడు దశాబ్దాల్లో పాక్‌ వెలగబెట్టిందిదే..! - India strongly rebuked pak at UN
close
Published : 26/09/2020 12:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడు దశాబ్దాల్లో పాక్‌ వెలగబెట్టిందిదే..!

ఐరాస వేదికపై పాక్‌ను కడిగిపారేసిన భారత్‌

న్యూయార్క్‌: ఏడు దశాబ్దాల చరిత్రలో ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు తప్ప పాకిస్థాన్‌ వెలగబెట్టిందేమీ లేదని భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నత స్థాయి అంతర్జాతీయ వేదికపై పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మన దేశ అంతర్గత విషయాలను ప్రస్తావించడంపై భారత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే వేదికగా పాక్‌ చరిత్రను బట్టబయలు చేసింది. ప్రధానిగా ఇమ్రాన్‌ వెలగబెట్టిన కార్యాల్ని ఎండగట్టింది. 

భారత్‌పై విషం చిమ్ముతూ.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ ఇప్పటికీ అనేకసార్లు భంగపడిన విషయం తెలిసిందే. కపట సానుభూతి ప్రదర్శించి భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాలనుకుంటున్న ఇమ్రాన్‌ కుట్రలు ఇసుమంతైనా ఫలించట్లేదు. అయినా, పాక్‌ తన దుర్బుద్ధిని మార్చుకోవడం లేదు. తాజాగా జరుగుతున్న ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో ఇమ్రాన్‌ఖాన్‌ శుక్రవారం ప్రసంగించారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ ఐరాస వేదిక స్థాయిని దిగజార్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భారత ప్రతినిధి మిజితో వినితో.. ఇమ్రాన్‌ ప్రసంగంపై నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం ఇమ్రాన్‌ ప్రసంగానికి బదులిచ్చే హక్కును వినియోగించుకొని పాకిస్థాన్‌ నిజస్వరూపాన్ని బహిర్గతం చేశారు. అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్‌ను కడిగిపారేశారు. 

‘‘75వ వార్షిక సమావేశం జరుపుకొంటున్న ఈ వేదిక నేడు అత్యంత దిగజారుడుతనాన్ని చూడాల్సి వచ్చింది. ద్వేషం, హింసను ప్రోత్సహిస్తున్న దేశాన్ని బహిష్కరించాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. ఆయన ప్రసంగం ఆసాంతం విస్తు గొల్పింది. ఇమ్రాన్‌ ఆయన గురించే చెప్పుకుంటున్నారా అనిపించింది. దేశం గురించి చెప్పుకోలేక, సాధించిన ఘనతలేవీ లేక, ప్రపంచానికి ఇవ్వడానికి ఎలాంటి సహేతుకమైన సందేశాలు లేక సతమవుతున్న వ్యక్తి(ఇమ్రాన్‌) అసహనాన్ని ఈరోజు ఈ సమావేశం చవిచూసింది. గత 70 సంవత్సరాల్లో ఉగ్రవాదం, మైనారిటీలపై దాడులు, దొంగచాటు అణు వ్యాపారాలు తప్ప పాక్‌ సాధించిందేమీ లేదు. ఐరాస నిషేధిత ఉగ్రవాదులకు పాక్‌ ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది.  ఈరోజు ఈ సభలో ప్రసంగించిన నాయకుడే(ఇమ్రాన్‌) కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ను అమరుడు అని సంబోధించారు. తమ సొంత ప్రజల్ని మట్టుబెట్టి దక్షిణాసియాకు మారణహోమాన్ని పరిచయం చేసిందీ ఇదే దేశం. ఇప్పటికీ ఆనాటి ఘటనలకు క్షమాపణలు చెప్పకపోవడం సిగ్గుచేటు. ఈరోజు భారత్‌పై విషం చిమ్మిన నాయకుడే(ఇమ్రాన్‌) తమ దేశంలో 30,000-40,000 మంది ఉగ్రవాదులున్నారని గత ఏడాది బహిరంగంగా అంగీకరించారు. చట్టాలను దుర్వినియోగపరుస్తూ హిందూ, సిక్కు, క్రైస్తవ తదితర మైనారిటీలపై దాడి చేసి వారి సంఖ్యను పాక్‌ ప్రభుత్వాలు తగ్గించాయి’’ అంటూ పాక్‌ నిజస్వరూపాన్ని భారత ప్రతినిధి తేటతెల్లం చేశారు. 

జమ్మూ-కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమని మరోసారి ఐరాస వేదికగా భారత్‌ పునరుద్ఘాటించింది. ఆ ప్రాంతంపై తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలు పూర్తిగా భారత అంతర్గత విషయాలని స్పష్టం చేశారు. పాక్‌ అక్రమంగా తమ అధీనంలోకి తీసుకున్న కశ్మీర్‌ ప్రాంతం మాత్రమే వివాదాస్పదమని చెప్పారు. వెంటనే పాక్‌ సేనలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని