బర్త్‌డే స్పెషల్‌: కీర్తి డ్రీమ్‌ టు డేరింగ్‌ రోల్స్‌..! - Interesting facts about keerthy suresh birth day special story
close
Published : 17/10/2020 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బర్త్‌డే స్పెషల్‌: కీర్తి డ్రీమ్‌ టు డేరింగ్‌ రోల్స్‌..!

‘మహానటి’ గురించి ఆసక్తికర విషయాలు

అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? ఆ అద్భుతమైన నటి పాత్రకు మరొకరు జీవం పోయడం వీలుకాని విషయమేనని.. 2018 వరకు సినీ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ అదే ఏడాది మే నెలలో ‘మహానటి’తో అందరి అభిప్రాయాలు తారుమారు చేశారు కీర్తి సురేశ్‌. ‘సావిత్రి’లా హావభావాలు పలికించి.. అందరి మెప్పు పొందారు. అందుకే ఆమె నటనకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రదానం చేసింది. ఇటు కమర్షియల్‌ చిత్రాలతోపాటు అటు కథానాయిక ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన సినిమాలతోనూ అలరిస్తూ కెరీర్‌లో ముందుకెళ్తున్న ఈ భామ శనివారం తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం..
వైవిధ్యంగా..

అంతర్జాతీయంగా విజయం అందుకున్న ‘మహానటి’ నుంచి కీర్తి సురేశ్‌ పాత్రల ఎంపికలో చాలా మార్పులు వచ్చాయి. హీరో పక్కన మెరిసి, మాయమయ్యే పాత్రలు మాత్రమే కాకుండా సవాలుతో కూడుకున్న స్క్రిప్టుల్ని ఎంచుకుంటున్నారు. ‘సీమరాజా’ ఫ్లాష్‌బ్యాక్‌లో మహారాణిగా కనిపించారు. ఇటీవల వచ్చిన ‘పెంగ్విన్‌’ భారాన్ని పూర్తిగా తన భుజాలపై మోశారు.  త్వరలో రాబోతున్న ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖి’ కూడా ఈ కోవకు చెందినవే.

మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ ‘మరక్కర్‌’లోనూ కీర్తి విభిన్న పాత్రలో అలరించబోతున్నారు. క్లాసికల్‌ మ్యూజిక్‌ కూడా నేర్చుకున్నారు. ఇందులో ఆమె చైనాకు చెందిన నటుడి ప్రేయసిగా నటిస్తున్నారు. మరోపక్క తమిళ హిట్‌ ‘వేదాలం’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనికి గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే.. ఆమె ఖాతాలో మరో ప్రత్యేక పాత్ర చేరినట్లే.

ఆ కళలు కూడా..

నటిగానే కాదు.. ఇతర విషయాల్లోనూ కీర్తి సురేశ్ మొదటి వరుసలోనే ఉన్నారు. ఆమె వయొలిన్‌ చక్కగా వాయిస్తారు. లాక్‌డౌన్‌లో ఆ కళకు మరింత పదును పెట్టినట్లు చెప్పారు. చిన్నతనంలో కీర్తి సురేశ్‌ స్విమ్మింగ్‌ బాగా చేసేవారట. తన ఇంటి దగ్గరున్న ఓ శిక్షణా కేంద్రంలో ప్రత్యేకంగా ట్రైనింగ్‌ తీసుకున్నారు. పాఠశాల, కళాశాలలో జరిగే నృత్య, నటనా ప్రదర్శనల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. అలాగని ఆమె చదువులో వెనకపడలేదండీ.. అందులోనూ ముందుండేవారట.

షాక్‌కి గురి చేశారు..

ఆరంభంలో కాస్త బొద్దుగా ఉన్న కీర్తి సురేశ్‌ ఈ మధ్య కాలంలో చాలా సన్నబడ్డారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఫిట్‌గా తయారయ్యారు. అయితే ఆమెలోని ఈ మార్పుపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైతేనేం.. ఆమె సినిమా కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమయ్యే నటి మరి.

ఫ్యాషన్‌ అంటే..

మాస్‌, క్లాస్‌ సినిమాలతో ఆల్‌రౌండర్‌ అనిపించుకున్న కీర్తి సురేశ్‌ డిజైనర్‌గా రాణించాలనుకున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు కూడా పూర్తి చేశారు. భవిష్యత్తులో సొంతంగా బొటిక్‌ను ప్రారంభిస్తానని చెప్పే కీర్తి.. ఇటీవల తను సొంతంగా డిజైన్‌ చేసిన దుస్తుల్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు.

డ్రీమ్‌ రోల్‌..

'వసంత కోకిల'లో శ్రీదేవి, 'క్వీన్‌'లో కంగన, 'కహానీ'లో విద్యా బాలన్ పోషించిన రోల్స్‌ అంటే కీర్తి సురేశ్‌కు ఆసక్తి. అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని చెబుతుంటారు. ఆమె విజయ్‌కు వీరాభిమాని. ఆయనతో కలిసి ‘భైరవ’లో నటించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు.

అవార్డులు

కీర్తి సురేశ్‌ తన నటనకు గానూ 10 పురస్కారాలు అందుకున్నారు. జాతీయ అవార్డుతోపాటు జీ సినీ అవార్డులు, సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డులు ఫిల్మ్‌ఫేర్‌, ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్బోర్న్‌ తదితర వేడుకల్లో ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు.

అమ్మలానే..

మలయాళ నిర్మాత సురేష్‌ కుమార్‌, నటి మేనకల కుమార్తె కీర్తి సురేశ్‌. అమ్మ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నటిగా మారారు. 2000లో బాలనటిగా అరంగేట్రం చేశారు. తండ్రి నిర్మాతగా వ్యవహరించిన మలయాళ చిత్రం 'పైలట్స్‌' ఆమె తొలి సినిమా. దీంతోపాటు 'అచనేయనెనిక్కిష్టం', 'కుబేరన్' తదితర చిత్రాల్లో, కొన్ని సీరియల్స్‌లో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ఆమె మొదటి సినిమా ఏడేళ్ల కిందట మలయాళంలో వచ్చిన 'గీతాంజలి'. 2016లో 'నేను శైలజ'తో తెలుగు వారిని పలకరించారు.

ప్రస్తుతం కీర్తిసురేశ్‌ తెలుగులో తెరకెక్కుతున్న 'రంగ్‌దే' సినిమాలో నటిస్తున్నారు. నితిన్‌ కథానాయకుడు. అట్లూరి వెంకీ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఆమె నటించిన ‘మిస్‌ ఇండియా’, ‘గుడ్‌లక్‌ సఖీ’ సినిమాలు విడుదలకు సిద్ధమౌతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా మార్చిలో విడుదల కావాల్సిన ‘మరక్కర్’ సినిమా వాయిదా పడింది. మరోపక్క కీర్తి సురేశ్‌ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని