గంగూలీ విషయంలో నిజం చెప్పిన ఇంజమామ్‌ - Inzamam ul Haq reveals about Gangulys infamous out that happend in 1999 Chennai Test
close
Updated : 21/11/2020 10:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గంగూలీ విషయంలో నిజం చెప్పిన ఇంజమామ్‌

అశ్విన్‌తో వీడియో ఛాట్‌ సందర్భంగా..

ఇంటర్నెట్‌డెస్క్‌: 1999లో పాకిస్థాన్‌తో తలపడిన చెన్నై టెస్టులో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ సౌరభ్‌ గంగూలీ వివాదాస్పదమైన ఔట్‌పై నాటి క్రికెటర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. తాజాగా టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో వీడియో ఛాట్‌ సందర్భంగా పాక్‌ మాజీ సారథి ఆరోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించాడు. నిజం చెప్పాలంటే అది సందేహాస్పదమైన ఔట్‌ అని పేర్కొన్నాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో గంగూలీ (2) పరుగుల వద్ద ఉండగా సక్లెయిన్‌ ముస్తాక్‌ బౌలింగ్‌లో కీపర్‌ మొయిన్‌  ఖాన్‌ చేతికి చిక్కాడు. పాక్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్లు కాసేపు చర్చించి దాదాను ఔట్‌గా ప్రకటించారు. 

‘ఆ సంఘటనలో ఇద్దరు ఆటగాళ్లు భాగమయ్యారు. ఒకరు అజర్‌ మహమ్మద్‌, రెండోది మొయిన్‌ఖాన్‌. గంగూలీ ఆడిన షాట్‌కు బంతి అజర్‌ శరీరానికి తాకి కిందపడుతుండగా మొయిన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే, ఇక్కడేం జరిగిందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేను. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో నా ఆరోగ్యం బాగోలేకపోతే అజర్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. గంగూలీ ఔటైనప్పుడు నేను మైదానంలో లేను. కానీ, అది మాత్రం సందేహాస్పదమైన ఔటే’అని ఇంజమామ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే, రీప్లేలో ఆ బంతి అజర్‌ కాలికి తాకాక నేలపై పడిన తర్వాత మొయిన్‌ క్యాచ్‌ అందుకున్నట్లు కనిపించడం గమనార్హం. అనంతరం టీమ్‌ఇండియా 258 పరుగులకు ఆలౌటై 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ క్యాచ్‌ను సందేహాస్పదమైనదిగా పేర్కొన్నందుకు ఇంజమామ్‌ను అశ్విన్‌ అభినందించాడు. 

అంతకుముందు ఇంజమామ్‌ పాకిస్థాన్‌ జట్టుకు ఎలా ఎంపికయ్యాడనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మాజీ సారథి ఇమ్రాన్‌ఖాన్‌.. తాను నెట్స్‌లో బ్యాటింగ్‌ చేయడం చూసే 1991లో జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పాడు. ఇది కేవలం ప్రచారం కాదని.. నిజమేనని ఇంజమామ్‌ స్పష్టతనిచ్చాడు. గడాఫీ స్టేడియంలో తాను ప్రాక్టీస్‌ చేస్తుండగా ఓసారి ఇమ్రాన్‌ఖాన్‌ అక్కడికి వచ్చాడని, దాంతో తన స్నేహితుల కోరిక మేరకు ఇమ్రాన్‌ తనని నెట్స్‌లో బ్యాటింగ్‌ చేయడం చూసి పాక్‌ జట్టుకు ఎంపిక చేశాడన్నాడు. అలా 1991 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంజమామ్‌ తర్వాత సుదీర్ఘ కాలం ఆ జట్టుకు సేవలందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే 119 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 2007లో ఆటకు వీడ్కోలు పలికాడు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని