ఆ రైతుల కౌలు తక్షణమే చెల్లించాలి:పవన్‌ - Janasena Chief Pawan Kalyan On Amaravati Formers Issue
close
Published : 27/08/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ రైతుల కౌలు తక్షణమే చెల్లించాలి:పవన్‌

అమరావతి: కౌలు అడిగిన రాజధాని రైతులను అరెస్ట్‌ చేయడం గర్హనీయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తున్న తీరు భావ్యం కాదన్నారు. కౌలు చెల్లించమని అడిగేందుకు ఏఎంఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన 180 మంది రైతులను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడాన్ని ఖండిస్తున్నట్లు పవన్‌ చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ పవన్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చిన ప్రతి రైతుకీ ఏప్రిల్‌ నెలలో వార్షిక కౌలు చెల్లించాలని పవన్‌ చెప్పారు. ఒప్పందంలోని నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కూడా ఉల్లంఘించి ఆలస్యంగా చెల్లించిందని గుర్తు చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా కౌలు చెల్లింపు జాప్యం చేస్తూ కౌలు సొమ్ములు వస్తాయో రావో అనే ఆందోళనలోకి రైతాంగాన్ని నెట్టేసిందని ఆరోపించారు. రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని.. సకాలంలో కౌలు చెల్లించాలని పవన్‌ సూచించారు.

జూన్ 21న కౌలు విడుదల చేస్తున్నట్లు రెండు జీవోలను జారీ చేసినా ఏ రైతు ఖాతాలోకీ కౌలు మొత్తం రాలేదన్నారు. ఆ జీవోలు వచ్చి రెండు నెలలు దాటినా సాంకేతిక కారణాలు చూపిస్తూ ఆ సొమ్ము చెల్లించకపోవడం రైతులను క్షోభకు గురి చేయడమే అవుతుందని చెప్పారు. తమ ప్రాంతంలో రాజధాని నిలుపుకోవడం కోసం 250 రోజులకి పైబడి రైతులు పోరాటం చేస్తున్నారని.. ఆ రైతులకు న్యాయం చేయాల్సిన తరుణంలో వార్షిక కౌలు కూడా చెల్లించకుండా జాప్యం చేయడం ఒప్పందం ఉల్లంఘనే అవుతుందన్నారు. తక్షణమే రైతులకు రావాల్సిన కౌలు ఇచ్చి ఒప్పందాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి పవన్‌ విజ్ఞప్తి చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని