దీపావళికి ఇంట్లోనే ‘లక్ష్మీ బాంబ్‌’..! - Laxmmi Bomb will release on OTT
close
Published : 17/09/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళికి ఇంట్లోనే ‘లక్ష్మీ బాంబ్‌’..!

అక్షయ్‌ అభిమానులకు శుభవార్త

ముంబయి: బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ అభిమానులకు శుభవార్త. కొవిడ్‌-19 నేపథ్యంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘లక్ష్మీబాంబ్‌’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ చిత్ర బృందం బుధవారం ప్రత్యేక ప్రోమోను విడుదల చేసింది. నవంబరు 9న డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ చిత్రం అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ దీపావళిని మీ ఇంట్లో ‘లక్ష్మీ బాంబ్‌’తో జరుపుకోండని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ప్రోమోలో అక్షయ్‌ లుక్‌కు నెటిజన్ల ప్రశంసలు లభిస్తున్నాయి.

తమిళ దర్శకుడు రాఘవ లారెన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన నటించి, తెరకెక్కించిన సూపర్‌హిట్‌ ‘కాంచన’కు హిందీ రీమేక్‌ ఇది. లారెన్స్‌ పాత్రలో అక్షయ్‌ నటిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిల్మ్స్‌, ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్‌లో విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. కానీ కరోనా వల్ల ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది.

మరోపక్క అక్షయ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘సూర్యవంశీ’ సినిమా మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూతపడటంతో విడుదలను వాయిదా వేశారు. ఇప్పటికే ‘గులాబో సితాబో’, ‘దిల్‌ బేచారా’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘శకుంతలదేవి’, ‘గుంజాన్‌ సక్సేనా’, ‘వి’ తదితర చిత్రాలు లాక్‌డౌన్‌లోనూ అలరించాయి. ఇప్పుడు అక్షయ్‌ చిత్రం కూడా ఆ జాబితాలో చేరింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని