close

తాజా వార్తలు

Published : 25/09/2020 17:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మర్యాద ‘బాలు’డికి గుండు తెచ్చిన అనుభవం

‘‘కోదండపాణిగారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు వుండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద ఎంత నమ్మకమంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా లేదు. నా మొదటి పాట విజయాగార్డెన్స్‌ ఇంజినీరు స్వామినాథన్‌తో చెప్పి ఆ టేప్‌ చెరిపేయకుండా సంవత్సరం పాటు అలాగే ఉంచేటట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు వచ్చినా, వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి రుణం నేను తీర్చుకోలేను’’. ‘బాలు’ అని ముద్దుగా పిలిపించుకునే పద్మభూషణుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గురుభక్తిని, వ్యక్తిత్వాన్ని చాటడానికి ఈ వివరణ చాలు. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసి సమ్మోహనాశక్తి బాలు గళానికే కాదు. అతని వ్యక్తిత్వానికీ ఉంది. అలాంటి అమృత కంఠం నేడు మూగబోయింది. ఇంతితై, వటుడింతై.. అన్నట్టు ఎదిగిన ఆ మహాను‘బాలుడు’ గురించి కొన్ని విషయాలు పంచుకుందామా?

1964లో మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న ఒక ‘బాలు’డికి ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వచ్చింది ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల, పెండ్యాల, ఘంటసాల. అయితే ప్రేక్షకుల్లో కూర్చుని ఆ పాట విన్న మరో సంగీత దర్శకుడు కూడా అక్కడే ఉన్నారు. ఆ ‘బాలు’డు పాట పాడిన విధానం అతనికి నచ్చింది. ఆ కుర్రాణ్ణి అభినందించారు. గొంతు లేతగా ఉంది. కొన్నాళ్లు పోతే సినిమాల్లో పాటలు పాడిస్తానని హామీ కూడా ఇచ్చారు. ఆయనెవరో ఈ బాలుడికి ముందు తెలియదు. తర్వాత తెలుసుకున్నారు అతడు కోదండపాణి అని. ఆ బాలుడే పద్మభూషణ్‌ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈ సంఘటన ముందు గూడూరు కళారాధన సమితి నిర్వహించిన లలిత సంగీత పోటీలకు ముఖ్య అతిథిగా ప్రముఖ నేపధ్య గాయని జానకి వచ్చారు. ఆ పోటీల్లో పాల్గొన్న బాలుకి ద్వితీయ బహుమతి వచ్చింది. ముఖ్యఅతిథి జానకి మాట్లాడుతూ బాలుకే ప్రథమ బహుమతి పొందే అర్హత ఉందని, వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమౌతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జానకి చెప్పిన మాటలు బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సినిమాలలో పాడేందుకు ప్రయత్నించమని ఆమె బాలుకి సలహా కూడా ఇచ్చారు. మద్రాసులోనే ఉంటూ ఇంజినీరింగ్‌ చదువుతుండడంతో తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా, రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడంతో ట్యూను ఒకసారి వింటే యాథాతథంగా పాడగలిగే వరాన్ని దేవుడు బాలుకి ఇచ్చాడు. అంతేకాదు బాలుకి స్టేజి ఫియర్‌ అసలే లేదు. అన్నిటికీ మించి బాలు గళం అతనికి భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం. అంతకుమించి అతనికి లభించిన యోగం!

మర్యాద ‘బాలు’డు

ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకి ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం కావడం విశేషం. బాలు వినిపించిన ‘‘రాగము.. అనురాగము..’’ అనే స్వీయ గీతం, ‘దోస్తీ’ సినిమాలో రఫీ పాడిన ‘‘జానే వాలో జరా’’ పద్మనాభానికి బాగా నచ్చాయి. వేటూరి రాయగా మాల్కోస్‌, యమన్‌, కల్యాణి, భాగేశ్వరి రాగాల్లో మట్లు కట్టిన ‘‘యేమి ఈ వింత మొహం’’ అనే రాగమాలికను రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌ వారి కార్యాలయంలో కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలసింది. అలవాటు ప్రకారం ఒక రోజు ప్రాక్టీసుకు వెళ్లిన బాలుకు పద్మనాభం కార్యాలయంలో పి.సుశీల, ఈలపాట రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌ కనిపించారు. తడబాటులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయం చేసి ‘‘యేమి ఈ వింత మొహం’’ పాట మొత్తాన్ని బాలుచేత పాడించి వినిపించారు. ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో రికార్డైంది. పాట మొదటి టేక్‌ లోనే ‘ఓకే’ కావడం విశేషం. జూన్‌ 2, 1967న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గాన గంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేపింది. చంద్రశేఖర ఫిలిమ్స్‌ వారు నిర్మించిన ‘మూగజీవులు’ సినిమాలో బాలు పాడిన ‘‘దయలేని లోకాన’’ అనే పద్యాన్ని కోదండపాణి, మహదేవన్‌కు వినిపించగా మెచ్చుకుని డి.బి.నారాయణ సినిమా ‘ప్రైవేట్‌ మాస్టారు’లో ‘‘పాడుకో పాడుకో.. పాడుతూ చదువుకో’’ అనే పాటను బాలు చేత పాడించారు. అక్కడే కళాతపస్వి కె.విశ్వనాథ్‌తో బాలుకు పరిచయమైంది. యన్టీఆర్‌, నాగేశ్వరరావులకు పాడే అవకాశాన్ని ఇచ్చింది కూడా మహాదేవనే. ‘‘ఏకవీర’’లో యన్టీఆర్‌కు, ‘‘ఇద్దరు అమ్మాయిలు’’లో అక్కినేనికి మహదేవన్‌ బాలు చేత పాడించారు.

తొలి స్వరాల ప్రభావం

దర్శకుడు విశ్వనాథ్‌ ‘ప్రైవేట్‌ మాస్టారు’ సినిమాలో బాలు పాడిన పాట తరవాత కోదండపాణి ‘సుఖ దుఃఖాలు’ సినిమాలో ‘‘మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు’’, ‘‘అందాలు చిందే ఆ కళ్లలోనే బంగారు కలలే దాగున్నవి’’ పాటలు బాలుచేత పాడించారు. ప్రైవేట్‌ మాస్టారులో బాలు పాడిన పాట విని బాపు-రమణలు ‘బంగారు పిచిక’ సినిమాలో బాలు చేత ‘ఒహోహో బంగారు పిచ్చికా’’, ‘‘మనసే గని తరగని గని తగ్గని గని’’ పాటలు పాడించారు. అదే మహదేవన్‌ ‘‘ఉండమ్మా బొట్టు పెడతా’’ సినిమాలో ‘‘రావమ్మా మహాలక్ష్మి రావమ్మా’’, ‘‘చుక్కలతో చెప్పాలని.. ఏమనీ’’, ‘‘చాలులే నిదురపో జాబిలీకూనా’’ పాటలు కూడా పాడించారు. ఆ తర్వాత పద్మనాభం నిర్మించిన ‘శ్రీరామకథ’లో కోదండపాణి ‘‘రామ కథ శ్రీరామ కథ’’, ‘‘రాగమయం.. అనురాగమయం’’ పాటలు మరికొన్ని పద్యాలు, శ్లోకాలు బాలు చేత పాడించారు. అలాగే ‘మంచి మిత్రులు’ సినిమాలో ఘంటసాలతో కలిసి ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’’ పాటను బాలు పాడారు. ఈ పాటలన్నీ సూపర్‌ హిట్లుగా నిలవడంతో బాలుకు మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ‘మహాబలుడు’ సినిమాలో ‘‘విశాల గగనంలో చందమామ’’, ‘ఆస్తులు-అంతస్తులు’లో ‘‘ఒకటై పోదామా ఊహల వాహినిలో’’ పాట; సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘టక్కరి దొంగ - చక్కని చుక్క’ సినిమాలో ‘‘నడకలు చూస్తే మనసౌతుంది’’, ‘‘ఓ.. కలలుగనే కమ్మని చిన్నారీ’’ పాటలు, ‘ముహూర్తబలం’ సినిమాలో మహదేవన్‌ సంగీత సారథ్యంలో ‘‘బుగ్గగిల్లగానే సరిపోయిందా’’ పాటలు ఆలపించారు. ఆ పరంపరలో సారథి స్టూడియోవారి ‘ఆత్మీయులు’ సినిమాలో ‘చిలిపి నవ్వుల నిను చూడగానే’’ పాటను సాలూరు రాజేశ్వరరావు బాలుచేత పాడించారు. ఆపై ‘జగత్‌ కిలాడీలు’ సినిమాలో ‘‘వేళ చూస్తే సందెవేళ.. గాలి వీస్తే పైరగాలి’’ పాట, ‘మనుషులు మారాలి’ సినిమాలో ‘‘తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో’’, ‘‘పాపాయి నవ్వాలి పండగే రావాలి’’ పాటలు; ‘బందిపోటు భీమన్న’ చిత్రంలో ‘‘నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో’’ పాట, ‘ఏకవీర’లో ఘంటసాలతో కలిసి ‘‘ప్రతిరాత్రి వసంత రాత్రి’’ పాట, మరికొన్ని పద్యాలు బాలు గళంలో మారుమోగాయి. దాంతో గాయకుడిగా బాలు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆ విధంగా 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు.

అభినవ తుంబురుడు
స్వర్ణయుగ సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడే అరుదైన అదృష్టం బాలుకు దొరికింది. పెండ్యాల సారథ్యంలో తొలిసారి బాలు ఒక పద్యం పాడారు. అది నచ్చి ‘మా నాన్న నిర్దోషి’ సినిమాలో పెండ్యాల బాలుచేత మూడు పాటలు పాడించారు. ‘‘అలకలు తీరిన కన్నులు యేమనె ప్రియా’’ అనే హిట్‌ సాంగ్‌, ‘‘నింగి అంచుల వేడి నేలపై నడయాడి’’ అనే గజల్‌ అద్భుతమైన పాటలు. కానీ ఆ రెండు పాటలు సినిమాలో లేకపోవడం దురదృష్టమే. ‘‘ఏమండి అబ్బాయిగారూ ఎలా వున్నారు’’ అనే పాట మాత్రం సినిమాలో ఉంది. సత్యం సంగీత దర్శకత్వంలో ‘పాల మనసులు’ సినిమాలో బాలు పాడిన ‘‘ఆపలేని తాపమాయే అయ్యయ్యో’’ అనే తొలిపాట కూడా సినిమాలో రాలేదు. తర్వాత సత్యం సినిమాలకు దాదాపు బాలు పాడిన పాటలే అధికం. తాతినేని చలపతిరావు దర్శకత్వంలో బాలు తొలిసారి పాడిన సినిమా ‘చిరంజీవి’ అలాగే మాస్టర్‌ వేణు ‘అర్ధరాత్రి’ సినిమాలో ‘‘ఈ పిలుపు నీకోసమే’’ పాటను తొలిసారి పాడించారు. ఆదినారాయణరావు ‘అమ్మకోసం’ సినిమాలో ‘‘గువ్వలా ఎగిరిపోవాలీ’’ పాటను, టి.వి.రాజు ‘నిండు హృదయాలు’ సినిమాలో మొదటి అవకాశమిచ్చి తర్వాత చాలా సినిమాల్లో పాటలు పాడించారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాలు ఎమ్మెస్‌. విశ్వనాథన్‌, ఇళయరాజా, జి.కె.వెంకటేష్‌, రమేష్‌నాయుడు, అశ్వథామ, చక్రవర్తి, రాజన్‌ - నాగేంద్ర, కీరవాణి వంటి స్వర్ణయుగ సంగీత దర్శకుల వద్ద మరపురాని మధురమైన పాటలు కొన్ని వేలు పాడారు. 

గుండు అనుభవం!

ఒకసారి విజయవాడ వస్త్రలత వారు బాలు బృందం వారి చేత సంగీత కచేరి నిర్వహించారు. ఇళయరాజాతో కూడిన బాలు బృందం ముందుగా విజయవాడ చేరుకుంది. బాలు తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకొని కాస్త ఆలస్యంగా విజయవాడ చేరుకున్నారు. అప్పటికే ఆడిటోరియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. సంగీత విభావరి మొదలవలేదని ప్రేక్షకులు అరుపులూ, కేకలతో గోల చేస్తున్నారు. ఆ రోజుల్లో ఈ మొబైల్‌ ఫోన్లు లేవు కదా. చేసేది లేక ఇళయరాజా ప్రోగ్రాం మొదలెట్టారు. ఇంతలో బాలు ఆడిటోరియం చేరుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. గేట్‌మన్‌ అభ్యంతర పెట్టాడు. లోపల ఉన్నవాళ్లకే చోటులేదని, తలుపులు తాళాలు వేసేశానని, తియ్యడం కుదరదని కాస్త మందలింపుగానే మాట్లాడాడు. బాలు వినయంతో అతనితో ‘బాబూ నేను బాలసుబ్రహ్మణ్యాన్ని కచేరిలో పాటలు పాడాలి వెళ్లనివ్వు’ అన్నారు. ‘‘ఈ రోజుల్లో ప్రతివాడికి తను ఘంటసాలననో, బాలసుబ్రహ్మణ్యాననో చెప్పుకోవడం అలవాటైంది తప్పుకో’’ అన్నాడు గేట్‌మన్‌. కార్యనిర్వాహకులెవ్వరూ కనిపించలేదు. ఇక చేసేది లేక బాలు వేరే గేటు ద్వారా తంటాలుపడి లోనికి వెళ్లి కార్యక్రమం కొనసాగించారు. ప్రేక్షకులు మూడు గంటలసేపు ఆ సంగీత వాహినిలో తేలియడుతూ మంత్ర ముగ్ధులై ఆలకించారు. చప్పట్లతో ఆడిటోరియం మారుమోగిపోయింది. కచేరి అయ్యాక బాలు సేదతీరుతున్న సమయంలో గేట్‌మన్‌ ఆయన దగ్గరకు వచ్చి ‘‘పొరపాటైంది. క్షమించండి సార్‌’’ అంటూ ప్రాధేయపడ్డారు. బాలు క్షమాగుణం గొప్పది ‘‘నీదేమి తప్పులేదు బాబూ.. నేనేమీ సినిమా స్టార్‌ను కాదుగా. పైగా గుండు చేయించుకున్నాను గుర్తుపట్టలేకపోవడం యాంత్రికమే’’ అంటూ సముదాయించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.