మేజర్‌ సందీప్‌ గురించి అడివి శేష్‌ ఏమన్నారంటే - MajorBeginnings
close
Updated : 27/11/2020 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేజర్‌ సందీప్‌ గురించి అడివి శేష్‌ ఏమన్నారంటే

పదేళ్లు రీసెర్చ్‌ చేశా..!

హైదరాబాద్‌: 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ‘ది లుక్‌ టెస్ట్‌’ పేరుతో తాజాగా ‘మేజర్‌’ చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘మేజర్‌’ను తెరకెక్కించాలనే ఆలోచన కలగడానికి గల కారణాన్ని అడివి శేష్‌ వెల్లడించారు. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ తనని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి అని శేష్‌ అన్నారు.

‘‘మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌.. నన్ను ఎంతలా ప్రభావితం చేశారో మాటల్లో చెప్పలేను. 2008 నుంచి నా ఆలోచనల్లో ఆయన ఉన్నారు. 26/11 ఉగ్రదాడి జరిగిన సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. 27న మద్యాహ్నం.. మేజర్‌ సందీప్‌ ఫొటోని న్యూస్‌ ఛానళ్లలో చూశాను. ఆయన ఫొటో చూడగానే.. సోదరుడ్ని చూసిన భావన కలిగింది. ఆయన కళ్లల్లో ఏదో తెలియని ప్రేరణ ఉంది. నాటి నుంచి సందీప్‌ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాలో కలిగింది. దీంతో వివిధ సందర్భాల్లో సందీప్‌ గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు, వార్తలు.. అన్నింటినీ కలెక్ట్‌ చేయడం ప్రారంభించాను. ఈ క్రమంలోనే పదేళ్లు గడిచిపోయాయి. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను’’

‘‘నటుడిగా మేజర్‌ సందీప్‌ జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పగలను అనే నమ్మకం వచ్చాక మొదటిసారి ఆయన తల్లిదండ్రుల్ని కలిశాను. సందీప్‌ గురించి నేను చేస్తున్న రీసెర్చ్‌ గురించి విని.. ఆయన త్రండి ఉన్నికృష్ణన్‌ నమ్మలేకపోయారు. అలా వాళ్లతో కొన్నిరోజులు గడిపాను. సందీప్‌కి సంబంధించిన ఎన్నో విషయాలు వాళ్లు నాతో చెప్పారు. అలాంటి తరుణంలో ఓరోజు.. ‘నా తనయుడి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించగలవని 100 శాతం నమ్ముతున్నా’ అని అంకుల్‌ అన్నారు. ఎలాగైనా సరే.. మేజర్‌ సందీప్‌ జీవితాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆక్షణం గట్టిగా నిర్ణయించుకున్నా. కొంతకాలానికి సినిమా తెరకెక్కించడానికి సందీప్‌ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు’’ అని అడివి శేష్‌ వివరించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని