
తాజా వార్తలు
విజయ్ తండ్రిగా సురేశ్గోపి..?
జోరుగా సాగుతోన్న ప్రచారం
హైదరాబాద్: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే పేరు ప్రచారంలో ఉంది. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈసినిమా షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ‘ఫైటర్’ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం గురించి ప్రస్తుతం అందరూ మాట్లాడుకుంటున్నారు.
పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళీ సురేశ్ గోపీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ తండ్రి పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. ‘ఫైటర్’ చిత్రంలో తండ్రీకొడుకుల సెంటిమెంట్ ముఖ్య భూమిక పోషించనున్న క్రమంలో.. సదరు పాత్రకు సురేశ్ గోపీ అయితే సరిపోతారని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు ఆయనను సంప్రదించగా.. ‘ఫైటర్’లో నటించేందుకు ఆయన ఆసక్తికనబరిచారని పలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయితే సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.