మారితేనే మంచిరోజులు..! - Modi stressed for reforms in UN At its 75th general assembly session
close
Updated : 22/09/2020 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారితేనే మంచిరోజులు..!

ఐరాస సర్వప్రతినిధి సభలో మోదీ కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ఏ లక్ష్యాలతో అయితే ఐక్యరాజ్య సమితి(ఐరాస) పురుడు పోసుకుందో వాటిని ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే సంస్థ ‘విశ్వసనీయత సంక్షోభం’లో పడుతోందని.. దాన్ని అధిగమించాలంటే నేటి ఆధునిక సవాళ్లకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లో జనవరి నుంచి భారత్‌ తాత్కాలిక సభ్యదేశంగా చేరనుంది. రెండేళ్ల పాటు ఆ హోదాలో కొనసాగనుంది. మరోవైపు భారత్‌కు శాశ్వత సభ్యదేశ హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక సమావేశంలో మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

నేటి ప్రపంచ వైవిధ్యతకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ గళం వినిపంచే అవకాశం కల్పించాలని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. 75 ఏళ్ల క్రితం యుద్ధ భయాలతో ప్రపంచమంతా వణికిపోతున్న సమయంలో ఐరాస ఆశాకిరణంగా ఉద్భవించిందన్నారు. మొట్టమొదటిసారి యావత్తు ప్రపంచ సంక్షేమం కోసం ఓ సంస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. కానీ, నాటి లక్ష్యాలు, వ్యవస్థలతో నేటి ఆధునిక సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. భారత సిద్ధాంతమైన ‘వసుదైక కుటుంబం’ స్ఫూర్తిని తలపించే ఐరాస లక్ష్యానికి మద్దతుగా నిలుస్తూ సంస్థ వ్యవస్థాపక సభ్యదేశంగా భారత్‌ సంతకం చేసిందని గుర్తుచేశారు. ఐరాస వల్లే నేడు భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని కొనియాడారు. అలాగే సంస్థ తరఫున ప్రపంచవ్యాప్తంగా శాంతిస్థాపన కోసం కృషి చేస్తూ అమరులైన వారికి నివాళులర్పించారు.

పరోక్షంగా అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరిగిన ప్రాముఖ్యతను సర్వప్రతినిధి సభలో మోదీ ప్రతిబింబించారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రాతిపదికను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అలాగే చైనా వంటి వ్యతిరేక శక్తులు తమ వీటో అధికారంతో భారత్‌ను పలు సందర్భాల్లో అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో పలుసార్లు తమ వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మోకాలడ్డింది. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌పై ఆర్థిక చర్యల కార్యదళం(ఎఫ్‌ఏటీఎఫ్‌) కఠిన ఆంక్షలు విధించకుండా అడ్డుకుంటోంది. ఇవన్నీ భారత్‌కు చికాకు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా చైనా దుర్బుద్ధికి చెక్‌ పెట్టొచ్చని భారత్‌ భావిస్తోంది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, ఇప్పటికే భారత్‌కు ఆ హోదా కల్పించడానికి సుముఖత వ్యక్తం చేశాయి. ఒక్క చైనా మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని