ఇటలీలో మృత్యుఘోష: కారణాలు ఏంటంటే..! - More Corona deaths in Italy
close
Updated : 22/12/2020 11:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇటలీలో మృత్యుఘోష: కారణాలు ఏంటంటే..!

రోమ్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ఇటలీ వణకిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ విజృంభణ ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా ఎక్కువగా ఇటలీ వాసులే మృతి చెందుతున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలోనూ ఇటలీలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ముందున్నాయి. అనంతరం ఎక్కువ మరణాలు యూరప్‌లోని ఇటలీలోనే చోటుచేసుకుంటున్నాయి. నిత్యం సరాసరి 600లకు పైగా ఇటాలియన్లు కరోనా వైరస్‌ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 68,800మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. ఇక అధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో ఇటలీ ఐదో స్థానంలో ఉండటం కలవరపెడుతోంది. అయితే, తక్కువ జనాభా ఉన్నప్పటికీ మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి గల కారణాలను పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) కూడా ఇటలీ మరణాలకు గల కారణాలను విశ్లేషించింది.

ఎక్కువ మరణాలు అందుకేనా..?
అధిక జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే ఇటలీలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి ఇక్కడి ప్రజల వయసే ప్రధాన కారణమని ప్రజారోగ్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రపంచంలో వృద్ధ జనాభా ఎక్కువగా ఉండటం, వారి ఆరోగ్య సమస్యలు ఈ మరణాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు. జపాన్‌ తర్వాత అత్యంత వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు ప్రతి నలుగురు ఇటాలియన్లలో ఒకరు వయసు 65ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. కొవిడ్‌ మరణాల్లోనూ ఈ వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. యూరప్‌లోనే అత్యంత ఎక్కువ వృద్ధ జనాభా ఇటలీలోనే ఉంది. దాదాపు 22.8శాతం ప్రజలు 65ఏళ్లకు పైబడినవారే ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం ఉన్న దేశాల్లో ఇటలీ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి ప్రజల ఆయుర్దాయం 83సంవత్సరాలు. అయితే, జీవనకాలం ఎక్కువగా ఉన్నప్పటికీ 65ఏళ్ల వయసుపైబడిన వారిలో దాదాపు 70శాతం మందికి కనీసం రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. వీటి కారణంగా వైరస్‌ బారినపడటం మరింత ఇబ్బందిగా మారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇది కూడా మరో కారణం..
కరోనా మరణాలు ఎక్కువగా ఉండటానికి వయసు ఒక కారణమైతే.. ఒకటికంటే ఎక్కువ తరాల వ్యక్తులు ఒకే కుటుంబంగా నివసిస్తుండటం కూడా మరో కారణంగా ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు మూడు తరాలకు చెందిన కుంటుంబ సభ్యులు ఒకేచోట ఉండటవల్ల ఆ ఇళ్లలో ఉండే యువతీ యువకులు, బంధువుల వల్ల వృద్ధులు వైరస్‌ బారినపడుతున్నట్లు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ విజృంభణ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మరణించిన వారిలో దాదాపు 95శాతానికి పైగా 60ఏళ్ల వయసువారే ఉన్నారు. దాదాపు 86శాతం మంది 70ఏళ్లకు పైబడిన వారు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాల్లో ఎక్కువగా ఈ వయసు వారే ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ.. ఇటలీలో వీరి సంఖ్య అధికంగా ఉంది.

రికార్డుస్థాయిలో తలసరి మరణాలు..
కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య ఇటలీలోనే ఎక్కువగా ఉంటోంది. అధికారిక లెక్కల ప్రకారం, ఇటలీలో ప్రతి లక్ష జనాభాకు 15 కరోనా మరణాలు రికార్డవుతున్నాయి. ఇది స్పెయిన్‌లో 6.3, జర్మనీలో 6.9, ఫ్రాన్స్‌లో 8.3 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, కరోనా విజృంభించిన తొలినాళ్లలో వైరస్‌ తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ, వైరస్‌ కట్టడీకి తీసుకున్న చర్యలు, వేసవికాలం రావడంతో ఇది కాస్త అదుపులోకి వచ్చింది. కానీ, తాజాగా యూరప్‌లో రెండో దఫా విజృంభణ మొదలు కావడం, దీనికి తోడు శీతాకాలం కూడా జతకావడంతో ప్రస్తుతం ఇటలీలో మరోసారి కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇటలీ ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ ఆంక్షలను విధించింది. జనవరి 6వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది. ఇక ఇటలీతో పాటు వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో ప్రతి పదిలక్షల మందికి కరోనా మరణాలు చోటుచేసుకుంటున్న తీరు ఇలా ఉంది..

దేశం   కరోనా మరణాల సంఖ్య(మిలియన్‌ జనాభాకు)

ఇటలీ        1076
స్పెయిన్‌     1006
బ్రిటన్‌       943
అమెరికా     924
మెక్సికో      886
ఫ్రాన్స్‌       863
భారత్‌       108

ఆరోగ్యవ్యవస్థ కూడా కారణమే..!
కేవలం కరోనా మరణాలకు వయసే కారణం కాదని..అక్కడి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకూడా మరో కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఊహించని ముప్పుగా కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై భారం పడటం, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత వంటి అంశాలు కొవిడ్‌ మరణాలు పెరుగుదలకు కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ పదువాకు చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్యుల కొరత ఉండటం, ప్రతి రోగిని జాగ్రత్తగా చూసుకోవడంలో విఫలం కావడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ కొన్ని ప్రాంతాల్లో వైద్య పడకల కొరత తీవ్రంగా ఏర్పడిందని.. దీంతో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న రోగులకు చికిత్స చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం కూడా వైరస్‌వ్యాప్తిని కట్టడిలో విఫలమైనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు తీవ్ర అనారోగ్యానికి గురైనవారు ఆలస్యంగా ఆసుపత్రులకు రావడంతో ఒక్కోసారి పరిస్థితి చేయిదాటి పోతోందని చెబుతున్నారు. ఇటలీలో చాలా ప్రాంతాల్లో అత్యంత ఆధునిక వసతులతో కూడిన వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ సుదూర ప్రాంతాలు, కొండ ప్రాంతాల ప్రజలకు ఈ సేవలు అందడం లేదని నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. వీటికి తోడు కరోనాను ఎదుర్కొవడంలో ముందస్తుగా సిద్ధం కాకపోవడం కూడా ఇటలీలో కరోనా తీవ్రత పెరగడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటలీ వ్యాప్తంగా 
కరోనా మరణాలు వయసుల వారీగా ఇలా ఉన్నాయి..

వయస్సు   మరణాల శాతం
0-39ఏళ్లు      0.3శాతం
40-49        0.9శాతం
50-59        3.4శాతం
60-69        9.8శాతం
70-79        25శాతం
80-89        41శాతం
90ఏళ్ల పైన    19శాతం

ఇవీ చదవండి..
కొత్తరకం కరోనాపై టీకా పనిచేస్తుందా?
కొత్తరకం వైరస్‌పై WHO ఏమన్నదంటే..!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని