2040కల్లా ప్రజలందరికీ ఈ మాంసమే: పూరి - NO MORE KILLING Puri Musings by Puri Jagannadh
close
Updated : 13/12/2020 05:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2040కల్లా ప్రజలందరికీ ఈ మాంసమే: పూరి

హైదరాబాద్‌: ‘రోజూ మనం తినే ఆహారం కోసం జంతువులను చంపటం చూడలేక మనలో చాలా మంది శాకాహారులుగా మారిపోతున్నారు’ అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నారు. పూరీ మ్యూజింగ్స్‌ పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇటీవల ‘నో మోర్‌ కిల్లింగ్‌’పై మాట్లాడారు.

‘‘మాంసాహారం తినే వాళ్లు సైతం చికెన్‌ తినమంటే లొట్టలేసుకుంటూ తింటారు. కానీ, కోడిని కోయమంటే మాత్రం కోయలేరు. అందుకే ఈ ప్రపంచానికెప్పుడూ కసాయివాడు కావాలి. మనుషులు ఆహారం కోసం చేపలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు ఇలా అన్నీ కలిపి రోజుకు మూడు బిలియన్ల జంతువులను మనం చంపుతున్నాం. ఇది చాలా దారుణం. అయితే ఇక నుంచి మాంసం కోసం మనం ఇలా ఏ జంతువునూ చంపాల్సిన అవసరం లేదు. అందుకు ఇజ్రాయిల్‌ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే కల్చరింగ్ మాంసం. ఏ జంతువును పెంచాల్సిన అవసరం లేదు. చంపాల్సిన అవసరం కూడా లేదు. ల్యాబ్‌లో మీకు కావాల్సిన మాంసాన్ని తయారు చేసుకోవచ్చు. వాటి కణాలు ఉంటే చాలు. బయో రియాక్టర్స్‌లో ఈ మాంసాన్ని తయారు చేస్తారు. అంతేకాదు వీటికి మొక్కల ఆధారిత పోషక పదార్థాలను జోడించి మరింత మంచి మాంసాన్ని తయారు చేస్తున్నారు. చాలా ఆరోగ్యకరమైన మాంసం. ఎలాంటి కలుషితం లేదు. హార్మోన్లు లేవు. యాంటిబయోటిక్స్‌ లేవు. ఎటువంటి హింసా లేదు’’

‘‘ఏ మాంసం కావాలంటే ఆ మాంసం కల్చర్‌ చేసుకోవచ్చు. రోజూ మనం తినే జంతువులు ఏం తిని, ఎక్కడ పెరిగాయో తెలియదు. వాటికి ఏం రోగాలు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అయినా తినేస్తుంటాం. వాటి కంటే ఈ ల్యాబ్‌లో తయారుచేసిన మాంసం చాలా మంచిది. ఇలాంటి మాంసాన్ని అమ్మటానికి ఇటీవలే ప్రభుత్వం అనుమతిని సైతం ఇచ్చేసింది. సింగపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో తాజాగా దీనిని మొదలుపెట్టారు. అక్కడ ఇప్పుడు చికెన్ బైట్స్ అమ్ముతున్నారు’’

‘‘అయితే నాకు కోడి కాళ్లు కావాలి, గుండెకాయ కావాలి, ఎడమకాయ కావాలి అంటే కుదరదు. చికెన్‌ మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. అతి త్వరలో అన్ని దేశాల్లో అందుబాటులో ఉంటాయి. ఇది శాకాహారులకు మంచి శుభవార్త. ఎందుకంటే శాకాహారులు చాలా సున్నితమైన వాళ్లు. ఎంత సున్నితత్వం లేకపోతే వాళ్లు శాకాహారులుగా మారతారు. ఇది వింటే శాకాహారులు చాలా ఆనందిస్తారు. ల్యాబ్‌లో పెంచే మాంసం, మొక్కల ఆధారితమైనది. కాబట్టి శాకాహారులు ఎంతో సంతోషంగా తినొచ్చు. ఇలా మాంసాన్ని ఉత్పత్తి చేయటం వల్ల వచ్చే కార్బన్‌ కూడా చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు సింగపూర్‌లో 10,000 లీటర్ల బయో రియాక్టర్లను వాడుతున్నారు. వాళ్లు ఇప్పుడు 50,000 లీటర్లకు నవీకరిస్తున్నారు. ఇలా వాళ్లు మొత్తం సింగపూర్‌ అంతటికి మాంసాన్ని అందించవచ్చు. మనకి కూడా త్వరలో వచ్చేస్తుంది. 2040 కల్లా మనుషులు ఉపయోగించే మాంసం మొత్తం ఇదే ఉంటుంది అని చెప్తున్నారు. చనిపోయిన జంతువుల నుంచి తీసుకోరు. ఆ మిగిలిన జంతువులను అడవిలో వదిలేస్తే ‘హమ్మయ్య’ అనుకుంటాయి’’ అని పూరి చెప్పుకొచ్చారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని