
తాజా వార్తలు
ఇంకా ఆస్కార్ రేసులోనే ‘నట్‌ఖట్’
ఇంటర్నెట్ డెస్క్: నట్‌ఖట్ సినిమా ఇంకా ఆస్కార్ రేసులోనే ఉందని ఆ చిత్ర దర్శకుడు షాన్ వ్యాస్ స్పష్టం చేశారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ లఘుచిత్రం గత జూన్‌లో విడుదలై మంచి విజయం సాధించింది. 2020 ఏడాదికిగానూ భారతీయ లఘుచిత్ర పురస్కారాల్లో విజేతగా నిలిచింది. దీంతో నేరుగా ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. ఇదంతా ఇలా ఉండగా.. ఇటీవల 93వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ‘షేమ్‌లెస్’ అనే లఘుచిత్రాన్ని నామినేట్ చేసినట్లు నివేదికలు వార్తలు వచ్చాయి. అయితే.. ‘నట్‌ఖట్’ ఇంకా ఆస్కార్ రేసులోనే ఉందని ఆ వార్తల్లో నిజం లేదని చిత్ర దర్శకుడు షాన్వ్యాస్ స్పష్టం చేశాడు.
‘‘ఈ విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇండియా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘నట్‌ఖట్’ ఉత్తమ లఘుచిత్రంగా నిలిచింది. నట్‌ఖట్ కూడా ఆస్కార్ రేసులో ఉంది. అయితే.. ఆస్కార్ షార్ట్‌లిస్ట్ ప్రకటన ఫిబ్రవరి 2021 మాత్రమే వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్కార్‌కు పంపేందుకు ఐదు సినిమాలను షార్ట్‌లిస్టులో ఉంచారు. అందులో నట్‌ఖట్, షేమ్‌లెస్, సౌండ్ ప్రూఫ్, సఫర్, ట్రాప్డ్ ఆ లిస్టులో ఉన్నాయి. అయితే.. వీటిల్లో ఆస్కార్‌కు వెళ్లే సినిమాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.