మీ టైం అయిపోయింది..ఇమ్రాన్‌ ఇక వెళ్లండి - Nawaz Sharif address the people from London via video conference
close
Updated : 17/10/2020 12:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ టైం అయిపోయింది..ఇమ్రాన్‌ ఇక వెళ్లండి

పాక్‌ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు

లాహోర్‌: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తూ చికిత్స కోసం లండన్‌లో ఉంటున్న పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మరోసారి విమర్శలకు పదునుపెట్టారు. పాక్‌ ప్రభుత్వం, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బజ్వాపై విరుచుకుపడ్డారు. బజ్వా వల్లే గత ప్రభుత్వం కూలిపోయిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసి గుజ్రాన్‌వాలాలో నిర్వహిస్తున్న ఆందోళనలో లండన్‌ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 2018 ఎన్నికల సమయంలో బజ్వా న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చి మరీ ఇమ్రాన్‌కు అధికారం కట్టబెట్టారని ఆరోపించారు.

‘‘ జావేద్‌ బజ్వా.. మీ స్వార్థ ప్రయోజనాల కోసం సక్రమంగా పని చేస్తున్న మా ప్రభుత్వాన్ని కూలదోశారు. మీకు నచ్చిన వారికి దానిని కట్టబెట్టారు’’ అని షరీఫ్‌ వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల తర్వాత బహిరంగ సభలో షరీఫ్‌ మాట్లాడటం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసిందని షరీఫ్‌ ఆరోపించారు. రాజకీయాల్లో పాకిస్థాన్‌ ఆర్మీ జోక్యం మానుకోవాలని హితవు పలికారు.

దాదాపు 9 విపక్ష పార్టీలన్నీ కలిసి పాకిస్థాన్‌ డెమొక్రాటిక్‌ మూమెంట్‌ (పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్) ప్రధాన ప్రతిపక్షం. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చి 2017లో అక్కడి సుప్రీం కోర్టు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. తీర్పునిచ్చిన న్యాయమూర్తుల పైనా అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఇమ్రాన్‌ చేపట్టిన సంస్కరణల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, ఆర్థిక మాంద్యం రెండు అంకెలకు చేరిపోయిందని విపక్షాలు విమర్శించాయి. ‘‘ మీ టైం ఆయిపోయింది ఇమ్రాన్‌ ఇక వెళ్లండి’’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. 

మరోవైపు తాను ప్రధాని కావడానికి ఆర్మీ సాయం చేసిందన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను ఇమ్రాన్‌ఖాన్‌ కొట్టిపారేశారు. ఆర్మీ తనకు ఎలాంటి సహకారం అందించలేదని స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో తమపై ఉన్న ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు తిరిగి 2023లో జరగనున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని