ఎవరెస్ట్‌ తాజా ఎత్తు ఎంతో తెలుసా? - New height of Mount Everest 8848.86 metres
close
Updated : 09/12/2020 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎవరెస్ట్‌ తాజా ఎత్తు ఎంతో తెలుసా?

నేపాల్‌, చైనా సంయుక్త ప్రకటన

కాఠ్‌మాండూ/బీజింగ్‌: ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా ప్రఖ్యాతి గాంచిన మౌంట్‌ ఎవరెస్ట్‌ తాజా ఎత్తును నేపాల్‌, చైనా మంగళవారం సంయుక్తంగా ప్రకటించాయి. తాజా సర్వే ప్రకారం ఇప్పుడు ఎవరెస్ట్‌ ఎత్తు 8,848.86 మీటర్లు. 1954లో భారత్‌ కొలిచినప్పటి ఎత్తుతో పోలిస్తే ఈ శిఖరం స్వల్పంగా 86 సెంటీమీటర్లు పెరగడం గమనార్హం.

2015లో నేపాల్‌లో వచ్చిన భీకర భూకంపం తర్వాత ఎవరెస్ట్‌ ఎత్తు తగ్గిపోయి ఉంటుందని అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. దీంతో ఈ శిఖరాన్ని కొలిచేందుకు నేపాల్‌ సిద్ధమైంది. ఇందుకోసం చైనా సాయం తీసుకుంది. 2019లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నేపాల్‌ పర్యటన సందర్భంగా.. ఎవరెస్ట్‌ కొత్త ఎత్తును సంయుక్తంగా ప్రకటించేందుకు ఇరు దేశాలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలా ఏడాది పాటు సర్వే జరిపిన అనంతరం సవరించిన ఎత్తును మంగళవారం రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. 

దాదాపు 65ఏళ్ల క్రితం భారత సర్వే ఆఫ్ ఇండియా మౌంట్‌ ఎవరెస్ట్‌ ఎత్తును కొలిచి 8,848 మీటర్లుగా నిర్ధారించింది. తాజాగా నేపాల్‌, చైనా సంయుక్తంగా చేసిన ప్రకటనలో ఎవరెస్ట్‌ తాజా ఎత్తు 8,848.86 మీటర్లుగా పేర్కొన్నాయి. అంటే గత కొలతలతో పోలిస్తే ఈ శిఖరం ఎత్తు స్వల్పంగా పెరిగింది. కాగా.. గతంలో పలుమార్లు ఎవరెస్ట్‌ ఎత్తుపై చైనా సర్వేలు చేపట్టింది. చివరగా 2005లో చేసిన ప్రకటనలో ఈ శిఖరం ఎత్తు 8,844.43మీటర్లే అని చెప్పింది. 

భారత ఉపఖండ ఫలకం, యూరోసియన్‌ ఫలకం మధ్యలో మౌంట్‌ ఎవరెస్ట్‌  ఉంది. ఈ ప్రాంతంలో కదలికలు ఎక్కువగా ఉండటం వల్ల యూరోసియన్‌ ఫలకం లోనికి భారత ఫలకం చొచ్చుకుపోతూ ఉంటుంది. దీంతో కొన్ని లక్షల  సంవత్సరాల కింద ఉన్న థెథీస్‌ అనే సముద్రం నుంచి హిమాలయాలు ఆవిర్భవించాయి.ఈ ఫలకాల నిత్య సంఘర్షణతో హిమాలయాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ మార్పుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.  1961లో చైనా, నేపాల్‌ తమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు రేఖ ఎవరెస్ట్‌ మధ్యలో నుంచి వెళ్తుంది. నేపాలీయులు ఎవరెస్టును సాగర్‌మాతగా పిలుస్తారు. టిబెట్‌ భాషలో దీన్ని మౌంట్‌ ఖోమోలాంగ్మాగా వ్యవహరిస్తారు. 

ఇదీ చదవండి..

మంచు కొండలకు సరికొత్త ముప్పు

 Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని