ఫిక్స్‌: అనుష్క చిత్రం కూడా ఓటీటీలోనే..! - Nishabdham On Prime
close
Updated : 18/09/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిక్స్‌: అనుష్క చిత్రం కూడా ఓటీటీలోనే..!

విడుదల తేదీ ఎప్పుడంటే..?

హైదరాబాద్‌: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడటంతో దర్శక, నిర్మాతలు ఓటీటీలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌లో అక్టోబరు 2న సినిమా అందుబాటులోకి రాబోతోందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి అభిమానులు సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘ఎదురు చూస్తున్నాం’ అని ఉత్సాహంగా కామెంట్లు చేశారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. గత కొన్ని రోజులుగా ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు శుక్రవారం యూనిట్‌ ధ్రువీకరించింది.

ఈ సందర్భంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియన్‌ కంటెంట్‌ డైరెక్టర్‌ విజయ్‌ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘ఇటీవల విడుదలైన మా డైరెక్ట్-టు-డిజిటల్ చిత్రాలు విజయవంతంగా రాణిస్తున్నాయి. మంచి కథతో తీసిన చిత్రానికి భాషతో పనిలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అనుష్క తొలి డిజిటల్‌ సినిమా. అమెజాన్ ఒరిజినల్ సిరీస్ ‘బ్రీత్’ సీజన్-1 తర్వాత మాధవన్‌ తిరిగి ఇందులో కనిపించబోతున్నారు. అపారమైన ప్రజాదరణ పొందిన అనుష్క, మాధవన్‌ దాదాపు 14 సంవత్సరాల తర్వాత తిరిగి ఒకే తెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను కనువిందు చేస్తుంది’ అని అన్నారు.

‘నేను ఇప్పటి వరకు పోషించిన అన్ని పాత్రలతో పోలిస్తే ‘సాక్షి’ నాకు చాలా కొత్తగా అనిపించింది. మాధవన్‌తో మళ్లీ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. వృత్తిపట్ల ఎంతో అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన. సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మాడ్సెన్, ఒలివియా డంక్లే, హేమంత్ మధుకర్, వివేక్ కూచిభోట్ల, డిఓపి షనీల్ డియోతోపాటు ‘నిశ్శబ్దం’లో భాగమైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా బృందం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ సినిమా అందుబాటులోకి తీసుకురాబోతున్న అమెజాన్‌కు ధన్యవాదాలు’ అని అనుష్క చెప్పారు.

మాధవన్‌ మాట్లాడుతూ.. ‘నాకు థ్రిల్లర్‌ చిత్రాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు అలాంటి చిత్రంలోనే నేను నటించా. అమెరికాలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ సినిమా షూట్‌ జరిగింది. ఈ కథ ప్రపంచ ప్రేక్షకులకు సంబంధించింది. సినిమా విడుదల కోసం నేను కూడా ఎదురుచూస్తున్నా. దాదాపు 200 దేశాల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కాబోతుండటం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.

2020 ఆరంభంలోనే ‘నిశ్శబ్దం’ థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఆపై లాక్‌డౌన్‌ కారణంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలిగా నటించారు. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు. మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, షాలినీ పాండే, శ్రీనివాస్‌ అవసరాల, మైఖేల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై కోన వెంకట్‌, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని