ప్రతి పదిమందిలో ఒకరి కొలువు హుష్‌  - One out of every ten loses job
close
Updated : 13/09/2020 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి పదిమందిలో ఒకరి కొలువు హుష్‌ 

తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగు 
నిరుద్యోగ తాజా సర్వేలో వెల్లడి 

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం తాండవిస్తోంది. అంతకు ముందుతో పోల్చితే కొంత తగ్గినట్లు కనిపించినా, ఆగస్టులో మళ్లీ పెరిగింది. పట్టణాలు, గ్రామాల్లో సగటున ఒక శాతం చొప్పున పెరగడం గమనార్హం. భారతీయ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ) సర్వేలో జాతీయ స్థాయి నిరుద్యోగిత రేటు 8.35 శాతంగా నమోదైంది. జులైలో 7.43 శాతం ఉంటే.. ఆగస్టు నాటికి 8.35 శాతానికి చేరింది. పట్టణాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. వ్యాపారాలు కుదేలు కావడంతో అందులో పనిచేస్తున్నవారి ఉద్యోగాలు పోతున్నాయి. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి పదిమందిలో ఒకరి ఉద్యోగం పోయినట్లు తెలుస్తోంది. వీరిలో 30 ఏళ్లలోపు యువతే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 

తెలంగాణలో 5.8 శాతం.. 
తెలంగాణలో నిరుద్యోగం రేటు కొంత తగ్గింది. జులైలో 9.1 శాతంగా ఉంటే.. ఆగస్టు నెలాఖరు నాటికి 5.8 శాతానికి తగ్గింది. ప్రస్తుత రేటు లాక్‌డౌన్‌కు పూర్వమున్న స్థితికి చేరుకున్నట్లు సీఎంఐఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే హరియాణాలో అత్యధికంగా 33.5 శాతంగా నమోదైంది. ఆ తరువాత త్రిపురలో  27.9 గా ఉంది. మొత్తం 13 రాష్ట్రాల్లో పది శాతానికన్నా ఎక్కువగా ఉంది. 
చిల్లిగవ్వ లేకుండా నెలరోజులు.. 
లాక్‌డౌన్‌ సమయంలో పట్టణాల్లోని 52 శాతం మంది కార్మికులు నెలరోజుల పాటు చేతిలో చిల్లిగవ్వ లేకుండానే జీవనం సాగించారు. చేసేందుకు పని లేక, వేతనాలు అందక కష్టాలతో కలిసి బతికారు. ప్రభుత్వాల పరిహారం నాలుగోవంతు మందికి మాత్రమే అందిందని, ఇక అసంఘటిత రంగంలో పనిచేసే వారి పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఒక సర్వేలో వెల్లడైంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌ (ఎల్‌ఎస్‌ఈ), యూకే ఆర్థిక సామాజిక పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఎల్‌ఎస్‌ఈ ఆర్థిక పురోగతి కేంద్రం (సీఈపీ) ఈ అధ్యయనం చేసింది. మే, జూన్, జులై నెలల్లో 18-40 ఏళ్లలోపు పట్టణ కార్మికులు 8,400 మందిని కలిసి వివరాలు సేకరించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న యువత ఉద్యోగాల కోతను ఎదుర్కొంటోందని ఆ సర్వే నివేదిక వివరించింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పట్టణ ఉపాధి హామీ పథకం అవసరమని 70 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆదాయం పడిపోవడంతో చాలామంది పేదరికంలోకి వెళ్లడంతో పాటు దీర్ఘకాల నిరుద్యోగ కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తోందని వెల్లడైంది. ఈ కష్టాలు తీర్చేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాతీయ విధానం అవసరమని అభిప్రాయపడింది. 
సర్వేలో వెల్లడైన విషయాలివి...
సర్వే చేసిన నెలల్లో 15.5 శాతం మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. మరో 21.7 శాతంమందికి చేసేందుకు పనిలేకుండాపోయింది. కొందరికి ఏప్రిల్‌ నెలకు వేతనాలు కూడా అందలేదు. 
కరోనాకు ముందుతో పోల్చితే ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం 48 శాతం పడిపోయింది. కరోనా కారణంగానే ఉద్యోగాలు పోయాయని 90 శాతానికిపైగా అభిప్రాయ పడ్డారు.
మూడునెలల సర్వే కాలంలో 80 శాతం మంది అసంఘటిత రంగం కార్మికులు పనిలేకుండా ఉండిపోయారు. సంఘటిత రంగంలో పనిచేస్తున్నవారిలో ఇది 20 శాతంగా ఉంది. 

సీఎంఐఈ సర్వేలో దేశవ్యాప్తంగా 
నిరుద్యోగం పరిస్థితి ఇది (అంకెలన్నీ శాతాల్లో) 

నెల   పట్టణాలు   గ్రామాలు    జాతీయసగటు
మార్చి 9.41  8.44    8.75 
ఏప్రిల్‌  24.95 22.89 23.52 
మే  25.79 22.48 23.48
జూన్‌ 12.02 10.52 10.99
జులై 9.15 6.66 7.43 
ఆగస్టు 9.83 7.65  8.35 

 

తెలంగాణలో...
నెల  నిరుద్యోగరేటు
మార్చి  5.8 
ఏప్రిల్‌  6.2 
మే  34.8 
జూన్‌   15.5 
జులై   9.1 
ఆగస్టు   5.8  


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని