ఆ 4వేల మందీ ఉగ్రవాదులు కారట! - Pak sasy Those 4 thousand are not terrorists
close
Updated : 19/10/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ 4వేల మందీ ఉగ్రవాదులు కారట!

జాబితా నుంచి తొలగించిన పాక్‌
మసూద్, హఫీజ్‌లపై చర్యకూ విముఖత
కట్టడిలో విఫలమైనందుకు మళ్లీ ఎఫ్‌టీఏఎఫ్‌ కొరడా?

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ కొమ్ము కాస్తోందని మరోసారి స్పష్టమైంది. అధికారిక ఉగ్ర జాబితా నుంచి 4 వేల మంది ముష్కరుల పేర్లను పాక్‌ హఠాత్తుగా తొలగించడంతో పాటు, భారత్‌లో మారణ హోమాలకు పాల్పడ్డ కరడుగట్టిన ఉగ్రవాదులు మౌలానా మసూద్‌ అజహర్, హఫీజ్‌ సయీద్‌లపై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థ ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది. దీంతో పాక్‌పై ఈ సంస్థ మరోసారి కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతోంది. దేశాల మధ్య హవాలా కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని నివారించడానికి ఏర్పడిన సంస్థే ఎఫ్‌ఏటీఎఫ్‌. భారత్‌ సహా 39 దేశాలకు సభ్యత్వం ఉన్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆయా దేశాల్లో ఉగ్రవాద సంబంధ ఆర్థిక కార్యకలాపాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలిస్తూ వాటిపై ఏటా సమీక్ష జరుపుతుంది. ఆయా దేశాల పనితీరు ఆధారంగా వాటిని వైట్, గ్రే, బ్లాక్‌ లిస్టుల్లో చేరుస్తుంది. ఉగ్రవాద కట్టడి విషయంలో పాక్‌ తీరు సంతృప్తికరంగా లేదంటూ 2018 జూన్‌లో దాన్ని ఈ సంస్థ గ్రే లిస్టులో చేర్చింది. వైట్‌ లిస్టులో చేర్చాలంటే 2019లోపు ఉగ్రవాద నిరోధానికి తాము నిర్దేశించిన చర్యలు తీసుకోవాలని గడువు విధించింది. అయితే పాక్‌ అందులో విఫలం కావడంతో దాన్ని గ్రే లిస్టులోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో 2020 జూన్‌లోపు 27 అంశాల్లో నిబద్ధత చూపాలని, అప్పుడే వైట్‌ లిస్టులో చేరుస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకూ అందులో 21 అంశాల్లో మాత్రమే పాక్‌ వైఖరిపై ఎఫ్‌ఏటీఎఫ్‌ సంతృప్తి చెందింది. మిగలిన ఆరింటిలో విఫలమైంది. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాదులు అజహర్, సయీద్, జాకిర్‌ రెహ్మాన్‌ లఖ్విలపై చర్యలు తీసుకోవడం కూడా ఆ ఆరింటిలో ఒకటి. దీంతోపాటు ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రకటించిన ఉగ్ర జాబితాలో ఉన్న 7,600 మంది ఉగ్రవాదుల నుంచి 4 వేల మందికిపైగా ముష్కరుల పేర్లను పాక్‌ తొలగించడం ఎఫ్‌ఏటీఎఫ్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో ఈనెల 21-23 మధ్య జరిగే సమీక్షా సమావేశంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాక్‌ను మరోసారి గ్రే లిస్టులోనే కొనసాగించడం ఖాయమని అధికార వర్గాలు తెలిపాయి. అదే జరిగితే ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు లాంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం మరింత గగనమవుతుంది. ఇదిలా ఉండగా ప్రయాణాలకు సంబంధించి బ్లాక్‌ లిస్టులో పెట్టిన 5 వేల మంది పౌరుల పేర్లను పాక్‌ తొలగించింది. విదేశాలకు ఫోర్జరీ పత్రాలతో వెళ్లినవారు, అక్కడ నేరాలకు పాల్పడినవారి పేర్లు ఇందులో ఉన్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని