అప్పటివరకు ‘గ్రే లిస్ట్‌’లోనే పాకిస్థాన్‌! - Pakistan to remain on Grey list
close
Published : 24/10/2020 02:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పటివరకు ‘గ్రే లిస్ట్‌’లోనే పాకిస్థాన్‌!

దిల్లీ: ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ప్రభుత్వానికి అంతర్జాతీయ వేదికపై మరోసారి చుక్కెదురైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు పాకిస్థాన్‌ గ్రే లిస్ట్‌లోనే ఉంటుందని అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) స్పష్టంచేసింది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను కట్టడి చేసేందుకు ఇప్పటికే పలుసార్లు గడువు ఇచ్చినప్పటికీ సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అరికట్టక పోవడంతోపాటు, మనీలాండరింగ్‌ విషయంలో పాకిస్థాన్‌ తీసుకున్న చర్యలపై నామినేటెడ్‌ దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు సంతృప్తి చెందలేదని సమాచారం. అయితే, ఉగ్రవాదులకు కేంద్రగానే పాకిస్థాన్‌ ఉందని భారత్‌ పేర్కొన్న మరుసటి రోజే తాజా నిర్ణయం వెలువడింది.

ఎఫ్‌ఏటీఎఫ్‌ తాజా నిర్ణయంతో పాకిస్థాన్‌ అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు పొందడం కష్టమే. ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ, యూరోపియన్‌ యూనియన్‌ వంటి సంస్థల నుంచి ఆర్థిక సాయం లభించడం పాకిస్థాన్‌కు కష్టమే అవుతుంది. అయితే, గ్రే లిస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి పాకిస్థాన్‌ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నట్లు నటిస్తోందని ఇప్పటికే పలుసార్లు బయటపడింది. తాజాగా 4వేల మందిని ఉగ్రవాదుల రికార్డుల నుంచి పాక్‌ తప్పించిన విషయం తెలిసిందే. ఇలా ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన కీలక లక్ష్యాలను అమలుచేయడంలో అలసత్వం వహించిన పాక్‌ను గ్రే లిస్ట్‌లోనే ఉంచుతూ ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్ణయం తీసుకుంది. జూన్‌లో జరగాల్సిన ఎఫ్‌ఏటీఎఫ్‌ సమావేశం తాజాగా వర్చువల్‌ పద్ధతిలో జరిగింది.

ఉగ్రవాదానికి ఊతమిచ్చే అతి ప్రమాదకర దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్ బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలోకి చేరుస్తుంది. కాగా ఇప్పటి వరకు ఇరాన్‌, ఉత్తర కొరియా మాత్రమే బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి మూడుదేశాల మద్దతు అవసరం. అయితే, చైనా, టర్కీ, మలేషియా దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతో బ్లాక్‌ లిస్ట్‌లోకి వెళ్లకుండా బయటపడుతోంది. అయితే, గ్రే లిస్ట్‌ నుంచి బయటపడడానికి పాకిస్థాన్‌కు మొత్తం 39 ఓట్లకు గాను 12 ఓట్లు అవసరం ఉంది. అప్పడే గ్రే లిస్ట్‌ నుంచి వైట్‌ లిస్ట్‌లోకి వస్తుంది.

తొలిసారిగా 2018 జూన్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది. అనంతరం వీటి నుంచి బయటపడేందుకు పాకిస్థాన్‌కు రెండు సార్లు సమయమిచ్చింది. వీటిలో భాగంగా ఉగ్రవాదులకు అందుతున్న నిధుల మూలాలను కనిపెట్టే దిశగా పాక్‌ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అలాగే పట్టుబడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు నిరూపించగలగాలి. ఐరాస గుర్తించిన ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలి. ఎఫ్‌ఏటీఎఫ్‌ నిర్దేశించిన ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పాక్‌ విఫలమవుతూనే ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని