ఇమ్రాన్‌.. చేతకాకపోతే మూటాముల్లె సర్దుకో! - Pakistans Opposition alliance all set to hold antigovt rally in Quetta
close
Published : 26/10/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇమ్రాన్‌.. చేతకాకపోతే మూటాముల్లె సర్దుకో!

పీడీఎం ర్యాలీలో విపక్ష నేతలు

కరాచీ: పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘పాకిస్థాన్‌ డెమోక్రాటిక్‌ మూవ్‌మెంట్’‌(పీడీఎం) తమ ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. గత సెప్టెంబరు 20న ఏర్పాటైన  ఈ కూటమి ఇప్పటికే  లాహోర్‌, కరాచీలలో రెండు భారీ సమావేశాలు నిర్వహించింది. తాజాగా ఇవాళ బెలూచిస్థాన్‌ రీజియన్‌లోని క్వెట్టాలో మరోసారి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ... పాకిస్థాన్‌ మిలటరీ రిగ్గింగ్‌ చేస్తే ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని అయ్యారని ఆరోపించారు. మరోవైపు ఈరోజు నిర్వహించే సమావేశానికి మిలిటెంట్ల నుంచి ముప్పు పొంచి ఉందని నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ (ఎన్‌సీటీఏ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ర్యాలీ వాయిదాపడే అవకాశముందని బెలూచిస్థాన్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆలీ షాష్వాణి కూడా చెప్పారు. కానీ, ఎన్‌సీటీఏ హెచ్చరికలను పీడీఎం కూటమి నేతలు బేఖాతరు చేశారు. ర్యాలీని యథాతథంగా నిర్వహించారు.

పీడీఎం అధ్యక్షుడు, జామియత్‌ ఈ ఇస్లామ్‌ ఫజల్‌ (జేయూఐ-ఎఫ్) మాట్లాడుతూ దేశంలో శాంతిభద్రతలు పరిరక్షించలేకపోతే మూటాముల్లె సర్దుకొని ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ఇక్కడ నిర్వహించే సమావేశానికి భద్రతాపరమైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత బెలూచిస్థాన్‌ ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఎవరికైనా ఏదైనా జరిగితే ఇక్కడి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాక్‌ మాజీ ప్రధాని షరీఫ్‌ లండన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ జావేద్‌ బెజ్వాపై లాహోర్‌ ర్యాలీలో షరీఫ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న షరీఫ్‌.. అనారోగ్యం కారణంగా గత నవంబర్‌ నుంచి లండన్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. చికిత్స కోసం అక్కడికి వెళ్లేందుకు లాహోర్‌ హైకోర్టు ఆయనకు అనుమతినిచ్చింది. మరోవైపు పీడీఎం చేస్తున్న ఆరోపణలను ఇమ్రాన్‌ఖాన్‌ కొట్టిపారేస్తున్నారు. తాను ప్రధాని కావడానికి పాక్‌ ఆర్మీ ఎలాంటి సాయం చేయలేదని చెబుతున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేయడమే లక్ష్యంగా గత నెల 20న 11 విపక్ష పార్టీలు కలిసి పీడీఎం పేరిట ఒకే వేదికపైకి వచ్చాయి. జనవరిలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి తరలివచ్చే మద్దతుదారులతో ఇస్లామాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి సన్నాహకంగా ప్రస్తుతం వివిధ నగరాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని