
తాజా వార్తలు
వాళ్లని చూస్తే కోపం వస్తుంది: శ్రుతిహాసన్
హైదరాబాద్: దాదాపు మూడేళ్ల విరామం తర్వాత తన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు కథానాయిక శ్రుతిహాసన్. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు, తమిళ ప్రాజెక్టులున్నాయి. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘లాభం’ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా లొకేషన్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో శ్రుతి.. మధ్యలోనే పేకప్ చెప్పేశారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రుతిహాసన్ సదరు వార్తలపై స్పందించారు. కరోనా నుంచి కాపాడుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు.
‘లాక్డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంభించిన సమయంలో సెట్లో అన్ని జాగ్రత్తలు పాటించేవాళ్లం. కానీ రాను రాను ప్రజలు కరోనాని సాధారణంగా తీసుకోవడం ప్రారంభించారు. కొవిడ్-19 అంటే జలుబు కాదు. అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరి జాగ్రత్తలు వాళ్లు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంతమంది మాస్క్ కూడా సరిగ్గా ధరించరు. అలాంటి వాళ్లని చూస్తే కోపం వస్తుంది. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ఒక్కసారి బ్రేక్ తీసుకున్నా. మరోసారి లాక్డౌన్ కోసం సిద్ధంగా లేను.’
‘ఒంటరిగా జీవించడం వల్ల ఈ ఏడాది ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జీవితంపట్ల ఓ క్లారిటీ వచ్చింది. మ్యూజిక్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగాను. 2021లో వ్యక్తిగతంగా ఇలాగే ఉండాలనుకుంటున్నాను’ అని శ్రుతిహాసన్ తెలిపారు.