ఆస్ట్రేలియాతో పోరాడి.. ఓ దేశాన్ని సృష్టించి..! - Puri Jagannadh about HUTT RIVER
close
Published : 04/11/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆస్ట్రేలియాతో పోరాడి.. ఓ దేశాన్ని సృష్టించి..!

‘హట్‌ రివర్‌’ చరిత్ర చెప్పిన పూరీ

హైదరాబాద్‌: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకంటూ ఓ దేశాన్ని సృష్టించుకున్న లినార్డ్‌ కాస్లే ఎంతో గొప్ప వ్యక్తని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ అన్నారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ‘హట్‌ రివర్‌’ గురించి వివరించారు. ఆ దేశం ఎలా ఏర్పడింది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనే విషయాల్ని చెప్పారు.

‘ఆస్ట్రేలియాలో ఓ రైతు ఉండేవాడు. అతడి పేరు లినార్డ్‌ కాస్లే. తనకు సొంతంగా కొంత భూమి ఉండేది. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసుకునేవాడు. అయితే ఓసారి పరిస్థితులు బాగోలేక పంటలు పండక రైతులు చాలా ఇబ్బందులుపడ్డారు. ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. అప్పుడు కాస్లే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశాడు. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అతడికి కోపం వచ్చింది. ‘అసలు ఆస్ట్రేలియా నా దేశం కాదు. నేను, నా పొలం ఓ దేశం. నా పిల్లలే నా సైన్యం. నేను దానికి రాజు’ అని నిర్ణయించుకున్నాడు. తనకున్న 75 చదరపు కిలోమీటర్ల నేలను మైక్రో నేషన్‌గా ప్రకటిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లేఖ పంపాడు. అందరూ నవ్వుకున్నారు. అతడు వారికి ఓ కమెడియన్‌లా కనిపించాడు. కాస్లే ఆ రాజ్యానికి ‘హట్‌ రివర్‌’ అని పేరు పెట్టాడు. 1970లో తనకు తానే స్వతంత్రం ప్రకటించుకున్నాడు. కొత్త జెండా, కరెన్సీ డిజైన్‌ చేసుకున్నాడు’.

‘ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలంటే అక్కడ కొన్ని సౌకర్యాలు ఉండాలి. ఆసుపత్రి, స్కూల్‌.. ఇలా కొన్ని ఉండాలని రూల్స్‌ ఉన్నాయి. అవన్నీ తనకు ఉన్నాయని చూపిస్తూ అన్నీ దేశాలకు లేఖ పంపాడు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి క్వీన్‌ ఎలిజబెత్‌కు లేఖ రాశాడు. ‘మేడం.. నేను మీ అభిమాని. ‘హట్‌ రివర్‌’ అనే దేశం మీది. నాకు ఏం జరిగినా మీరే చూసుకోవాలి’ అన్నాడు. క్వీన్‌ ఎలిజబెత్‌ అతడి లేఖ అంగీకరిస్తూ.. తన మద్దతు తెలుపుతూ ఓ లేఖ పంపారు. దాంతో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మతిపోయింది. ఇప్పుడు అతడ్ని ఏమైనా చేస్తే ఎలిజబెత్‌ సీరియస్‌గా తీసుకుంటుందేమో అని భయపడింది. ఎందుకంటే.. ఒకప్పుడు ఆస్ట్రేలియా బ్రిటిషు ఆధీనంలో ఉండేది. ఆ రోజు నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడి జోలికి వెళ్లడం మానేసింది. నిజంగానే అది ఓ దేశం అయిపోయింది. ఈ కొత్త దేశాన్ని చూడటానికి సందర్శకులు వెళ్లడం మొదలుపెట్టారు. ఆ మైక్రో దేశానికి వెళ్లి.. రాజు-రాణితో కలిసి భోజనం చేసేవాళ్లు. అది క్రేజీ టూరిస్ట్‌ ప్రదేశం అయిపోయింది’.

‘ఇప్పటికీ 50 ఏళ్లు గడిచాయి. 95 ఏళ్ల వయసులో కాస్లే ఈ మధ్య చనిపోయాడు. కొవిడ్‌ కారణంగా గత ఏడాదిగా వారికి సందర్శకులు లేరు. ఆదాయం తగ్గిపోయింది. కుటుంబం కష్టాల్లో పడింది. క్వీన్‌ ఎలిజబెత్‌కు కూడా 95 ఏళ్లు వచ్చాయి. ఆమెకూ అన్నీ గుర్తు ఉండటం లేదట. దీన్ని అదునుగా తీసుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ కుటుంబంపై కేసు పెట్టింది. 50 ఏళ్లుగా పన్ను కట్టలేదని ఒత్తిడి తీసుకొచ్చింది. ఇప్పుడు 25 మంది కుటుంబీకులు మిగిలారు. ఆయన పిల్లలకు కూడా 60 ఏళ్లు దాటాయి. వయసు అయిపోయి, ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేక.. ఈ మధ్యే భూమిని అమ్మకానికి పెట్టారు. అప్పులు తీర్చి.. తర్వాత ఆస్ట్రేలియాలో కలిపేస్తారు. ఏది ఏమైనా కాస్లే గొప్ప. తనకంటూ ఓ దేశాన్ని సృష్టించుకుని 50 ఏళ్లు కింగ్‌లా బతికాడు..’ అని పూరీ ముగించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని