
తాజా వార్తలు
ఐఏఎస్ కావాలని.. కాపీ రైటర్‌గా పనిచేసి..!
రాశీ బర్త్‌డే స్పెషల్.. ఇవి మీకు తెలుసా?
బాల్యంలో గాయని కావాలనుకుంది. వయసు పెరిగే కొద్దీ పుస్తకాల పురుగ్గా మారింది. చదువులో టాపర్‌గా నిలిచింది. ఐఏఎస్ ఆఫీసర్‌గా మారి.. ప్రజలకు సేవలందించాలని కలకంది. తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు.. ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. కాలం ఆమెను అందరూ మెచ్చే కథానాయికను చేసింది. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తోనే కుర్రకారు కలల రాణిగా మారిన రాశీ ఖన్నా గురించేనండీ ఇదంతా.. సోమవారం ఈ అందాల భామ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
రాశీ ఖన్నా దిల్లీలో పుట్టి, పెరిగారు. అక్కడే పాఠశాల, కళాశాల చదువులు పూర్తి చేశారు. చిన్నతనంలో గాయని కావాలనుకున్నారట. కానీ పెద్దయ్యే కొద్దీ చదువుపై ఆసక్తి పెరిగి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలకన్నట్లు ఓసారి చెప్పారు. చదువు పూర్తయ్యాక ప్రకటనలకు కాపీ రైటర్‌గా పనిచేశారు. ఆపై ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చింది.
ప్రకటనలతో గుర్తింపు పొందిన రాశీ ఖన్నాకు 2013లో హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చింది. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె జాన్ అబ్రహం భార్యగా పాత్రలో నటించారు. చిత్రం రూ.100 కోట్లు వసూలు చేయడంతో ఆమె ఆరంభం అదిరింది.
‘మద్రాస్ కేఫ్’లో రాశీ నటనకు ఇంప్రెస్ అయిన నటుడు శ్రీనివాస్ అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’లో కథానాయిక పాత్ర కోసం సంప్రదించారు. ఈ క్రమంలో ‘మనం’ చిత్రంలో అతిథి పాత్ర (నాగచైతన్య ప్రేయసి) పోషించే అవకాశం కూడా వచ్చింది. దానికి కూడా రాశీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ కన్నా ముందే ‘మనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె పూర్తిస్థాయిలో కథానాయికగా తెలుగువారికి పరిచయమైంది మాత్రం నాగశౌర్య చిత్రంతోనే. ఆపై వరుస సినిమాలతో బిజీగా గడిపారు. ‘జోరు’, ‘జిల్’, ‘శివమ్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘హైపర్’, ‘జై లవకుశ’ చిత్రాలతో స్టార్ అయ్యారు.
2018లో రాశీ కోలీవుడ్‌కు కూడా పరిచయం అయ్యారు. అక్కడ కూడా వరుస సినిమాలతో నటిగా నిలదొక్కుకున్నారు. గత ఏడాది ‘అయోగ్య’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో మరికొన్ని హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు కోలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్, యాక్టింగ్‌పై ఏ మాత్రం ఆసక్తిలేదని, నటి కావాలనే ఆలోచన ఏ రోజూ రాలేదని రాశీ అంటుంటారు.
నటిస్తూనే ఈ భామ గాయనిగానూ తన స్వరంతో అలరించారు. ‘జోరు’, ‘విలన్’, ‘బాలకృష్ణుడు’, ‘జవాన్’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాల కోసం పాటలు పాడారు. రాశీ గాత్రానికి కూడా అభిమానులు ఏర్పడ్డారు.
దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ వైఫల్యం ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇదే చేదు అనుభవాన్ని రాశీ కూడా ఎదుర్కొన్నారట. ‘నా జీవితంలో తొలి ప్రేమ తాలూకు అనుభవాలున్నాయి. స్కూల్లో చదివే రోజుల్లో పదిహేడేళ్ల వయసులో సీనియర్‌తో ప్రేమలో పడ్డాను. తొలుత అతడే నాకు ప్రోజ్ చేశాడు. ఏం చెప్పాలో పాలుపోలేదు. అంతవరకు నాకు ప్రేమంటే ఏంటో తెలియదు. కొన్ని సంఘటనల తర్వాత ఆ ప్రేమకథ విఫలమైంది’ అని ఓసారి ఆమె గుర్తు చేసుకున్నారు.
‘హైపర్’ (2016) వరకు రాశీ కాస్త బొద్దుగానే ఉండేవారు. కానీ ‘జై లవకుశ’లో (2017) స్లిమ్‌గా కనిపించి, సర్ప్రైజ్ చేశారు. ‘సినిమా కోసం, పాత్ర కోసం బరువు తగ్గలేదు. నా కోసం ఫిట్నెస్ను జీవనశైలిలో భాగం చేసుకున్నా. సన్నబడటం వల్ల నా కెరీర్ ఇంకా బలపడింది..’ అని ఓ ఇంటర్వ్యూలో రాశీ చెప్పారు.
-ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం