రాజస్థాన్‌ ఘన విజయం - Rajasthan won by 7 wkts
close
Published : 20/10/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజస్థాన్‌ ఘన విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టింది. అబుదాబి వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 125 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (35*, 30 బంతుల్లో, 4×4) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్‌ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బట్లర్ (70*; 48 బంతుల్లో, 7×4, 2×6) అజేయ అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి చేరి ప్లేఆఫ్‌కు అవకాశాలు మెరుగుపర్చుకుంది. మరోవైపు చెన్నై ఈ ఓటమితో ఆఖరి స్థానంలో నిలిచి తమ‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.

లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. ధాటిగా ఆడుతున్న బెన్‌స్టోక్స్‌ (19; 11 బంతుల్లో, 3×4)ను దీపక్‌ చాహర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కొద్దిసేపటికే రాబిన్‌ ఉతప్ప (4), సంజు శాంసన్‌ (0) ఔటవ్వడంతో 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన బట్లర్‌.. స్మిత్‌ (26*; 34 బంతుల్లో, 2×4)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. స్మిత్ నిదానంగా ఆడగా.. బట్లర్ దూకుడుగా ఆడుతూ పరుగులు సాధించాడు. ఈ క్రమంలో బట్లర్ 37 బంతుల్లో అర్ధశతకం నమోదుచేశాడు. అనంతరం స్మిత్‌ కూడా గేర్‌ మార్చడంతో రాజస్థాన్‌ 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 98 పరుగులు సాధించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్‌ రెండు, హేజిల్‌వుడ్‌ ఒక వికెట్ తీశారు.

రాణించిన జడేజా

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి శుభారంభం దక్కలేదు. రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సామ్‌ కరన్‌ (22), డుప్లెసిస్‌ (10)‌, షేన్‌ వాట్సన్‌ (8), అంబటి రాయుడు (13) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా (35*, 30 బంతుల్లో, 4×4)తో కలిసి ధోనీ (28; 28 బంతుల్లో, 2×4) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో స్కోరు వేగం నెమ్మదించింది. కాగా, గేర్‌ మార్చే సమయంలో ధోనీ రనౌటయ్యాడు. ఆఖర్లో జడేజా బౌండరీలు బాదడంతో చెన్నై 125 పరుగులు చేయగలిగింది. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్‌ జాదవ్‌ (4*; 7 బంతుల్లో) దూకుడుగా ఆడలేకపోయాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్, కార్తీక్‌ త్యాగి, శ్రేయస్‌ గోపాల్‌, రాహుల్ తెవాతియా తలో వికెట్ తీశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని