క్రికెట్‌లో స్నేహాన్ని పక్కనపెట్టి కఠినంగా ఉండాలి - Ramiz Raja expressed disgrace about Pakistan Team and says friendship should be kept aside in selection process
close
Published : 06/09/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రికెట్‌లో స్నేహాన్ని పక్కనపెట్టి కఠినంగా ఉండాలి

పాకిస్థాన్‌ జట్టుపై మాజీ క్రికెటర్‌ అసహనం..

(ఫొటో: పాకిస్థాన్‌ క్రికెట్‌ ట్విటర్‌ నుంచి)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ జట్టు ఎంపికలో స్నేహాన్ని పక్కనపెట్టి కఠినంగా ఉండాలని, ఆటగాళ్ల ప్రదర్శన బట్టే ఎంచుకోవాలని పాకిస్థాన్‌ మాజీ ఓపెనర్‌ రమిజ్‌ రాజా అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు క్రిక్‌కాస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత సవేరా పాషా మాట్లాడుతూ వచ్చే ఏడాది జరగబోయే పొట్టి ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ లాంటి పెద్ద జట్లు ఇప్పటికే సరైన కాంబినేషన్లు ప్రయత్నిస్తున్నాయని, ఆ విషయంలో పాకిస్థాన్‌ వెనుకపడినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. దానికి స్పందించిన మాజీ క్రికెటర్‌‌.. వాటిని చూసి పాకిస్థాన్‌ నేర్చుకోవాల్సి ఉందని, ఇతర కాంబినేషన్లను కూడా ప్రయత్నించాలని సూచించాడు. 

‘వాళ్లని చూసి పాక్‌ నేర్చుకోవాలి. అన్ని కోణాల్లో ఆటగాళ్లను పరీక్షించకపోతే టీ20 ప్రపంచకప్‌లో సరైన జట్టు కనిపించదు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా లాంటి జట్లు ఇప్పటికే పేరు పొందినా అవి ప్రయోగాలు చేస్తున్నాయి. కానీ పాకిస్థాన్‌ మాత్రం ఇప్పటికిప్పుడే ఫలితాలు రావాలని చూస్తోంది. సరైన జట్టు కావాలంటే సెలక్టర్లు నిర్దయగా ఉండాలి. ఇమ్రాన్‌ఖాన్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఇలాగే చేశాడు. తన చుట్టూ ఎప్పుడూ ఐదారు మంది ఆటగాళ్లు ఉండేవారు. అప్పట్లో వారికి ఇంకా రెండేళ్లు ఆడే అవకాశం ఉన్నా అందరినీ పక్కనపెట్టాడు. జావెద్‌ మియాందాద్‌ లాంటి యువకులతో జట్టును నింపాడు. అలాగే 1992 ప్రపంచకప్‌లో యువ జట్టుతోనే బరిలోకి వెళ్లాము. కాబట్టి.. జట్టు ఎంపికలో కఠినంగా ఉండాలి. సరైన ప్రణాళికలు కూడా ఉండాలి. అందరికీ కొత్త ఆటగాళ్లని ప్రోత్సహిస్తామని చెప్పాలి. ఫలితాలు అప్పుడే రాకపోయినా దీర్ఘకాలంలో అదే మంచి చేస్తుంది’ అని మాజీ బ్యాట్స్‌మన్‌ వివరించాడు.

మరోవైపు జట్టు ఎంపికలో ఆటగాళ్లు స్నేహాన్ని పక్కనపెట్టాలని, మంచి ప్రదర్శన చేసేవారినే ఎంపిక చేయాలని రమిజ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే, ఎవరైనా దీర్ఘకాలిక ఫలితాలను వదిలేసి తాత్కాలిక విజయాల మీదే దృష్టిపెడతారని చెప్పాడు. ఇక ఇప్పుడు పాక్‌ జట్టులో జరుగుతున్న విషయాలు తనకు అర్థం కావడం లేదని మాజీ బ్యాట్స్‌మన్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఒకవైపు బాబర్‌ అజామ్‌ లాంటి యువకుడిని కెప్టెన్‌గా చేసి మరోవైపు హఫీజ్‌, మాలిక్‌ లాంటి వయసు పైబడిన క్రికెటర్లను కొనసాగించడం ఏంటని ప్రశ్నించాడు. జట్టు ఎలాంటి ఆలోచనలతో ముందుకెళుతుందో తెలియడం లేదన్నాడు. ఇప్పుడు హఫీజ్‌ బాగా రాణిస్తున్నందున పర్వాలేదని, ఒకవేళ అతడు విఫలమైతే ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోతే అప్పుడు ఇబ్బందులు పడతారని పాక్‌ మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని