
తాజా వార్తలు
ప్రేమలో విఫలమైతే తట్టుకోవడం చాలాకష్టం
రేణూ దేశాయ్
హైదరాబాద్: ప్రేమలో విఫలమైతే.. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమని నటి రేణూదేశాయ్ అన్నారు. ఆ బాధ నుంచి బయటపడడానికి ఆత్మహత్య చేసుకోవడం సరైన మార్గం కాదని ఆమె తెలిపారు. చాలాకాలం తర్వాత ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన రేణు.. పలువురు నెటిజన్లు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో నెటిజన్లు నేర్చుకున్న కొత్తవిషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆత్మహత్య కరెక్ట్ కాదు..!
‘నీ జీవితం, ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు. ప్రేమలో విఫలమైతే ఎంతో బాధ కలుగుతుందని నాకు తెలుసు. మనం ప్రేమించే వ్యక్తి మన పక్కనలేడని.. మనల్ని మోసం చేశాడనే ఆలోచనలు చాలా కష్టంగా ఉంటాయి. కానీ, ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఆ బాధ నుంచి బయటపడొచ్చు. కౌన్సిలింగ్ తీసుకోవడం, కుటుంబసభ్యులు, స్నేహితుల సాయంతో మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు’
ఆ పాత్ర నాకు బాగా నచ్చింది..!
‘‘ప్రస్తుతం నేను ‘ఆద్య’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నాను. ఆ పాత్ర నాకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాను.’’
ఎప్పుడూ ఒకేలా ఉండాలి..!
‘ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఒకేలా జీవించాలి. బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. అలాగే సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. దీనినే ఫాలో అవ్వాలనుకుంటున్నాను.’
దర్శకత్వం వహిస్తా..!
‘రైతులపై నేను తెరకెక్కించనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నాను. అలాగే ‘ఆద్య’ కాకుండా మరో కథలో నటించడానికి ఓకే చేశాను. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తాను. అలాగే నేను దర్శకత్వం వహించనున్న ఓ సినిమా స్ర్కిప్ట్‌కు సంబంధించి వర్క్ చేస్తున్నా. వచ్చే ఏడాదిలో దానిని పట్టాలెక్కించాలనుకుంటున్నా’ అని రేణూదేశాయ్ వెల్లడించారు.