CSKలో కలవరం.. RCBలో ఉత్సాహం.. - Royal challengers ban Bangalore happy
close
Updated : 29/08/2020 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CSKలో కలవరం.. RCBలో ఉత్సాహం..

కోహ్లీ, అనుష్క సంబరాలు

ఒకరినొకరు కలిసిన ఆనందంలో బెంగళూరు ఆటగాళ్లు

మళ్లీ ఏకాంతంలోకి వెళ్లిన బాధలో చెన్నై క్రికెటర్లు

(RCB Twitter Images)

ఒకవైపు చెన్నై సూపర్‌కింగ్స్‌లో కరోనా కలవరం మొదలైతే మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో ఆనందోత్సాహాలు ఆరంభమయ్యాయి. అటువైపు కీలకమైన సురేశ్‌ రైనా స్వదేశానికి వెళ్లిపోతుండగా ఇటువైపు ముఖ్యమైన ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌, క్రిస్‌ మోరిస్‌ విదేశం నుంచి వచ్చేశారు. సీఎస్‌కేలో ఆటగాళ్లు కరోనా బారిన పడి మళ్లీ ఏకాంతంలోకి వెళ్తే.. ఆర్‌సీబీలో మాత్రం ఏకాంతం నుంచి బయటకొచ్చిన ఆటగాళ్లు అందరూ కలిశారు. ఒక శిబిరంలో గందరగోళం నెలకొలంటే మరో బృందంలో సంతోషం నెలకొంది.. ఎందుకంటారా?


కఠినంగానే ఆంక్షలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో బీసీసీఐ ప్రామాణిక నిర్వాహక ప్రక్రియలో కఠిన ఆంక్షలు విధించింది. అన్ని ఫ్రాంచైజీలు వీటిని పాటించాయి. విమానం ఎక్కేందుకు 24 గంటల ముందు రెండుసార్లు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించాలని చెబితే అంతకన్నా ఎక్కువే చేయించాయి. పీపీఈ కిట్లు ధరించి దుబాయ్‌కు ఆటగాళ్లను తీసుకొచ్చాయి. అయితే వైరస్‌ ఉనికి ఎక్కువగా ఉన్న చెన్నైలో సాధనా శిబిరం ఏర్పాటు చేయడం సీఎస్కే కొంప ముంచింది! ఆర్‌సీబీ మాత్రం ఇందుకు భిన్నంగా కఠినమైన పద్ధతినే ఎంచుకుంది.


గదులకే పరిమితం

దుబాయ్‌కు ప్రయాణమయ్యే ఏడు రోజులు ముందు వరకు బెంగళూరులోని శిబిరంలో కోహ్లీసేన మొత్తం ఏకాంతానికే పరిమితమైంది. ఒకరినొకరు కలవలేదు. చూసుకోలేదు. ప్రత్యక్షంగా మాట్లాడుకోలేదు. కేవలం తమకు కేటాయించిన గదులకే పరిమితం అయ్యారు. బయటకొచ్చి మాట్లాడుకొన్నట్టూ కనిపించలేదు. విరాట్‌ అందరికన్నా ఒక రోజు ముందే యూఏఈలో అడుగుపెట్టాడు. జట్టుతో ఎందుకు రాలేదని అందరూ ప్రశ్నించారు. అయితే అనుష్క శర్మతో కలిసి వెళ్లాడని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడామె ఆర్‌సీబీ శిబిరంలోనే ఉంది.


కోహ్లీ హెచ్చరిక

దుబాయ్‌ చేరుకున్నా బెంగళూరు ఆటగాళ్లు మళ్లీ ఆరు రోజులు ఏకాంతవాసమే గడిపారు. కఠిన నిబంధనలు పాటించారు. పక్కపక్క గదుల్లోనే ఉన్నా ఎవ్వరూ ప్రత్యక్షంగా కలుసుకోలేదు. ఫోన్లలో మాట్లాడుకున్నారు. నచ్చినవి ఆనందంగా తిన్నారు. తమ గదుల్లోనే కసరత్తులు చేశారు. వర్చువల్‌గా సమావేశమయ్యారు. బయో బుడగ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ఒక్కరు చేసే తప్పుతో అంతా నాశనం అవుతుందని విరాట్‌, ఆర్‌సీబీ డైరెక్టర్‌ మైక్‌ హెసన్‌ ఆటగాళ్లను హెచ్చరించారు. నిజం చెప్పాలంటే వీరిద్దరిదే ఒకే తరహా శైలి! ఆటకోసం శ్రమిస్తారు.. తపిస్తారు. అవసరమైతే అత్యంత కఠినంగా ఉంటారు. ఇంతలోనే 1, 3, 6వ రోజు పరీక్షలు పూర్తయ్యాయి. బీసీసీఐ మూడు చెబితే ఆర్‌సీబీ ఆరుసార్లు టెస్టులు చేయించింది. సిబ్బందితో సహా అందరూ నెగెటివ్‌గా తేలారు.


ఆఖరికి ఆనందోత్సాహాలు

అందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారని నిర్ధరించుకున్న తర్వాత ఆర్‌సీబీ అందరినీ ఒకేచోటకు చేర్చింది. కలుసుకొనేందుకు అవకాశమిచ్చింది. ఆటగాళ్లు ఆనందంగా ఒకరినొకరు చూసుకున్నారు. మాట్లాడుకున్నారు. కలిసి భోజనం చేశారు. మానసిక ఉల్లాసం కోసం ఆటలు ఆడారు. శుక్రవారం రోజు సాయంత్రం సాధన కూడా చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను ఆర్‌సీబీ అభిమానులతో పంచుకుంది. మరో విశేషం ఏంటంటే.. కోహ్లీ, అనుష్క కలిసే ఉన్నారు. అనుష్క ప్రస్తుతం గర్భిణి కావడంతో విరుష్క జంట అందరి సమక్షంలో కేక్‌ కోసి వేడుక చేసుకొంది. వీలైనంత మేరకు ఆటగాళ్లు భౌతిక దూరం పాటించారు. శిబిరంలో ఎక్కడ చూసినా ఆహ్లాదం.. ఆనందం.. ఆస్వాదనే కనిపించింది. డైరెక్టర్‌ హెసెన్‌, కోచ్‌ కటిచ్‌, కెప్టెన్‌ కోహ్లీ త్రయం ఈ సారి ట్రోఫీ గెలిచేందుకు భారీ వ్యూహాలే అమలు చేసేలా కనిపించారు.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని