ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం: ప్రముఖుల ట్వీట్లు - Saddened by the passing of Jaya Prakash Reddy tweeted mahesh babu
close
Published : 08/09/2020 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం: ప్రముఖుల ట్వీట్లు

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి మృతి పట్ల సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలిపారు. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, ప్రకాశ్‌రాజ్‌, అనిల్‌ రావిపూడి, సుధీర్‌బాబు, గోపీచంద్‌ మలినేని, తమన్‌ తదితరులు పోస్ట్‌లు చేసిన వారిలో ఉన్నారు.

 బాలకృష్ణ: ఎన్నో మంచి పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి మృతి విచారకరం, పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా.

 పరుచూరి గోపాలకృష్ణ: వెండి తెరమీద వెలుగుతూ కూడా రంగస్థలాన్ని మరువని నటుడు, రాయలసీమ యాసకు ప్రాణం పోసిన మా జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశాడన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.

వెంకటేశ్‌: నా స్నేహితుడు జయప్రకాశ్‌ రెడ్డి అకస్మాత్తు మరణం నన్ను కలచివేసింది. ఆయనతో కాంబినేషన్‌ తెరపై చాలా గొప్పగా ఉండేది. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాం.

మోహన్‌బాబు: జయప్రకాశ్‌ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాశ్‌ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ.. పాత్రలు పోషిస్తూ ఉండేవారు. పది మందికి సహాయం చేయాలనే వ్యక్తి. జయప్రకాశ్‌ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని కోరుకుంటున్నా. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

రాజేంద్ర ప్రసాద్‌: మేమంతా ప్రేమగా జేపీ అని పిలుచుకునే జయప్రకాశ్‌ రెడ్డి గుండెపోటుతో హఠాత్ముగా మాకు దూరం కావడం దారుణమైన వార్త. స్టేజ్‌ నుంచి సినిమాకు వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. రాయలసీమ ట్రెండ్‌తో భయంకరమైన విలన్‌ నుంచి పూర్తి కామెడియన్‌గా రాణించారు. మొన్న ‘సరిలేని నీకెవ్వరు’ సినిమాలోనూ ‘కూజాలు చెంబులైపోతాయి..’ అంటూ తనకంటూ మార్క్‌ ఏర్పరచుకున్నారు. నన్ను ప్రసాదూ.. అనేవారు. ఆయన మరణం అభిమానుల్ని కూడా చాలా బాధిస్తోందని తెలుసు. కానీ జీవితంలో కొన్నింటిని అంగీకరించక తప్పదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

బెనర్జీ: ఉదయాన్నే చాలా బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది. నటుడు జయప్రకాశ్‌ రెడ్డితో నాకు మంచి అనుబంధం ఉంది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా మేం మాట్లాడుకునేవాళ్లం. ఆయన ఓ మంచి వ్యక్తి. ఆయన నిజానికి స్కూల్‌ టీచర్‌. పిల్లలకు పాఠాలు చెబుతూ, చెబుతూ.. అదే మనసును అలవరచుకున్నారు. ఆయన ఎటువంటి పాత్రకైనా జీవం పోసేవారు. ‘జయం మనదేరా’ సినిమా నుంచి ఆయన్ను డాడీ అని పిలుస్తున్నా. ఇటీవల కూడా ఫోన్‌లో మాట్లాడా. తెలుగు చిత్ర పరిశ్రమ ఓ మంచి నటుడ్ని కోల్పోయింది. ఇటువంటి నటుడు మళ్లీ వస్తారా? అంటే ప్రశ్నార్థకమే. చాలా ఆరోగ్యకరమైన వ్యక్తి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

మహేశ్‌బాబు: జయప్రకాశ్‌ రెడ్డి గారి మరణం నన్ను ఆవేదనకు గురి చేసింది. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ గొప్ప నటుడు, కమెడియన్‌. ఆయనతో కలిసి పనిచేసిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా సానుభూతి తెలుపుతున్నా.

ఎన్టీఆర్‌: అద్భుతమైన నటనతో అందరినీ అలరించిన జయప్రకాశ్‌ రెడ్డి గారు ఇక లేరు అనే వార్త బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

ప్రకాశ్‌రాజ్: సహ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి గారి హఠాన్మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నటనంటే ఆయనకు ప్రాణం. అటు వెండితెరపై, ఇటు స్టేజ్‌ నాటకాలలో పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు ఆయన. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మాకు వినోదం పంచినందుకు ధన్యవాదాలు  సర్.

రవితేజ: జయప్రకాశ్ రెడ్డి గారి గురించి తెలిసిన తర్వాత చాలా బాధపడ్డా. ఆయన్ను నేను సరదాగా మామ అనేవాడ్ని. ఆయన మృతి తీరని లోటు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి మామ.

సుధీర్‌బాబు: భయంకరమైన వార్తతో నిద్రలేచా. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.

అనిల్‌ రావిపూడి: జేపీ గారితో నా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైంది. నేను తీసిన దాదాపు అన్నీ చిత్రాల్లోనూ ఆయన నటించారు. ఆయన నన్ను తన సొంత మనిషిలా చూసుకునేవారు, ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయన్ను నేను చాలా మిస్‌ అవుతున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి సర్‌. ఓ నటుడిగా, వ్యక్తిగా.. మీ స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు.

తమన్‌: జయప్రకాశ్‌ రెడ్డి గారి మృతి ఎంతో బాధిస్తోంది. దీన్ని తట్టుకునే శక్తిని ఆ దేవుడు కుటుంబ సభ్యులకు ఇవ్వాలి.

ప్రణీత: తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది తీరని లోటు.. ఓం శాంతి.

బండ్ల గణేశ్‌: జయప్రకాశ్‌ రెడ్డి గారి మరణం నన్నెంతో బాధించింది. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం సర్‌.

గోపీచంద్‌ మలినేని: ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త విని షాక్‌ అయ్యా.. చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. 

శ్రీముఖి: జయప్రకాశ్‌ రెడ్డి గారి మరణం ఎంతో బాధాకరం.

శ్రీరామ్‌ ఆదిత్య: మీ అద్భుతమైన నటన మిమ్మల్ని మాకెప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. మనం ఓ గొప్ప నటుడ్ని కోల్పోయాం.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌: మా మిత్రుడు జయప్రకాశ్‌ రెడ్డి ఇకలేరనే వార్తతో నిద్రలేచాం. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నాం.
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని