Tuck jagadeesh: నానిని అలా అనడం చూసి.. బాధేసింది - Shiva nirvana interview about nani tuck jagadeesh
close
Updated : 07/09/2021 06:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tuck jagadeesh: నానిని అలా అనడం చూసి.. బాధేసింది

‘‘ఓ కథ థియేటర్లకు అనుకుంటే.. దానికి తగ్గట్లుగానే రాయాల్సి ఉంటుంది. ఓటీటీకి అనుకుంటే.. అందుకు తగ్గట్లుగానే మలచుకోవాల్సి ఉంటుంది. థియేటర్‌ కోసం రాసిన కథను ఓటీటీకి ఇవ్వడం కష్టంగానే ఉంటుంది’’ అన్నారు శివ నిర్వాణ. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి  భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు ‘Tuck Jagadeesh’తో ఓ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రుచి చూపించనున్నారు. Nani కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శివ నిర్వాణ. అవి ఆయన మాటల్లోనే..

‘‘మజిలీ’ పూర్తయిన వెంటనే నానితో సినిమా చేయాలనుకున్నా. ఆఫీసుకెళ్లి కథ చెప్పడమే ఓ ట్విస్ట్‌తో చెప్పా. అది వినగానే ఆయనకి బాగా నచ్చి చేసేద్దామన్నారు.  నిజానికి కథ వినడానికి వచ్చేటప్పుడు ఆయన నాకు ‘నో’ ఎలా చెప్పాలని అనుకున్నారట. ఎందుకంటే అంతకు ముందు నేను తీసినవన్నీ ప్రేమకథలే కావడంతో మళ్లీ అలాంటిది చెప్తాననుకున్నారు. నేను.. భూదేవిపురం, భూకక్షలు అని చెప్పగానే ఎగ్జైట్‌ అయ్యారు’’.


కథకు అదే స్ఫూర్తి..

‘‘నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి   కుటుంబంలోనే పెరిగాను. తాతగారింట్లో బాబాయిలు, అత్తలు అలా అందరి మధ్య పెరిగాను. నేను చూసిన ఆ కుటుంబ భావోద్వేగాలన్నింటినీ ప్రేక్షకులకు చూపించాలనుకున్నాను. ఇన్ని ఫ్యామిలీ డ్రామా చిత్రాలు వచ్చాక ప్రేక్షకుల్ని మెప్పించాలంటే ఏవో కొన్ని కొత్త విషయాలు ఉండాలి కదా. అందుకే నేను చూసిన ఎమోషన్స్‌ను వాస్తవికంగా ‘టక్‌ జగదీష్‌’తో చూపించా’’.


ఇంట్లోనే సమస్య వస్తే..

‘‘టక్‌ జగదీష్‌ సరదాగా ఉండే కుర్రాడు. బయటి నుంచి కుటుంబానికి ఏ సమస్య వచ్చినా ఇరగ్గొడతాడు. అదే ఇంట్లో వాళ్ల వల్లనే సమస్య వస్తే.. దాన్ని ఎలా పరిష్కరించాడనేది కథ.  మలుపులు ఆకట్టుకుంటాయి. జగదీష్‌ నాయుడుగా  నాని క్యారక్టరైజేషన్‌ను ప్రతిబింబించేలాగే టైటిల్‌ అలా ఫిక్స్‌ చేశాం. ఆయన టక్‌ వెనకాల ఓ సిన్సియర్‌ కారణం ఉంటుంది’’.


కళ్లు చెమర్చేలా..

‘‘నిన్నుకోరి’లో ప్రేమికుల మధ్య.. ‘మజిలీ’లో భార్యాభర్తల మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది. ఇందులో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే గొడవలు, అసూయల నేపథ్యంలో ఓ సంఘర్షణ ఉంటుంది.  నాని పాత్రలో ఫన్‌.. పవర్‌.. ఎమోషన్స్‌.. ఇలా మూడు షేడ్స్‌ ఉంటాయి. జాతర సీన్‌ అదిరిపోతుంది. పాటలు, ఫైట్స్‌ కథలో భాగంగానే ఉంటాయి తప్ప ఎక్కడా ఇరికించినట్లుగా ఉండవు’’.


అనుకోకుండా..

‘‘సాధారణంగా నేను పాడను కానీ, అనుకోకుండా ఈ చిత్రం కోసం గళం విప్పాల్సి వచ్చింది. గోపీసుందర్‌తో నేపథ్య సంగీతం చేయిస్తున్నప్పుడు ఓచోట చిన్న బిట్‌ సాంగ్‌ ఉంటే బాగుండు అనిపించింది. నాకున్న కొద్దిపాటి సాహిత్యానుభవంతో ఓ పాట రాసి, పాడి వినిపిస్తే నాని బాగుందన్నారు. మరొకరితో ఆ పాట పాడిద్దామనుకుంటే.. వద్దు ఇదే ఉంచెయ్‌ బాగుంది కదా అని వారించారు. అలా అనుకోకుండా గాయకుడిగా మారా. నేను పూర్తి పాటలు రాయలేను కానీ, పదాలు తడితే అప్పుడప్పుడు పాటలు కట్టేస్తుంటా. ‘నిన్నుకోరి’లోని ‘‘కదిలే నదిలా’’, ‘మజిలీ’లోని ‘‘ఏడెత్తు మల్లెలు’’ అలా పుట్టినవే’’.


ఆ విషయంలో భయపడను...

‘‘సినిమాలో ఏముందో.. ట్రైలర్‌తో అదే చెబుతాను. అలా చెప్పేందుకు నేనెప్పుడూ భయపడను. మా చిత్రం అమెజాన్‌లో విడుదల కావడం వల్ల మరింత ఎక్కువ మందికి రీచ్‌ అవుతుందనుకుంటున్నా. నాని సినిమాని ఎంతగా ప్రేమిస్తారో.. అందరికీ తెలుసు. అలాంటి ఆయన్ని డిస్ట్రిబ్యూటర్లు రకరకాలుగా అనడం చూస్తే బాధగా అనిపించింది. అందుకే ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో అలా కాస్త ఎమోషనల్‌ అయ్యాను. కథ ఏది కోరితే ఆ ఎమోషన్‌ ఇవ్వాల్సిందే. నాకు పడి పడి నవ్వుకునే సినిమా తీయాలనుంది. విజయ్‌ దేవరకొండతో అలాంటి ఓ కథతోనే సినిమా చేయనున్నా. మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని