టీమ్‌ఇండియాను ఏమనాలి.. మీరే చెప్పండి! - Shoaib Akhtar confirms that talks are going on with PCB as a replacement for Misbah ul Haq as a chief selector
close
Updated : 11/09/2020 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీమ్‌ఇండియాను ఏమనాలి.. మీరే చెప్పండి!

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న టీమ్‌ఇండియాను, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఏమని విమర్శించాలో మీరే చెప్పండంటూ పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మరోసారి తనని విమర్శించేవారికి చురకలు అంటించాడు. ‌పాక్‌ క్రికెట్‌ బోర్డులో చీఫ్‌ సెలెక్టర్‌గా కొనసాగుతున్న మిస్బా ఉల్‌ హక్‌ స్థానాన్ని త్వరలో అతడు భర్తీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న తరుణంలో అక్తర్‌ స్పందించాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు.. ఈ విషయంపై నిజంగానే పీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. దాన్ని దాచాల్సిన అవసరం లేదని, ప్రస్తుతానికి చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టంచేశాడు. 

‘అవును అది నిజమే. ప్రస్తుతం పీసీబీతో చర్చలు జరుపుతున్నా. ఈ విషయంలో నేనూ ఆసక్తిగానే ఉన్నా. ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదు. అంతకుమించి ఏం చెప్పలేను. ప్రస్తుతం నేను చాలా మంచి స్థితిలో ఉన్నా. నా శక్తి మేరకు క్రికెట్‌ ఆడాను. ఇప్పుడు బాగానే సెటిలయ్యాను. అయితే, పాకిస్థాన్‌ క్రికెట్‌ మంచి కోసం నా సుఖమైన దినచర్యను కూడా వదులుకోడానికి సిద్ధంగా ఉన్నా. అవకాశం వస్తే ఆ బాధ్యతలు తీసుకుంటా. నిజం చెప్పాలంటే నాకే పదవి, బాధ్యతలు అవసరం లేదు. జీతం కోసం పనిచేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సాధారణ ప్రజలు డబ్బుల కోసం పనిచేస్తారు. నేను అలా కాదు’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. ఇక పాకిస్థాన్‌ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఉందని, మాజీ దిగ్గజాలైన జావెద్‌ మియాందాద్‌, వసీం అక్రమ్‌, ముస్తక్‌ మహ్మద్‌ లాంటి ఆటగాళ్లను తయారుచేయాలని ఉందన్నాడు. అలాగే 15 మంది మ్యాచ్‌ విన్నర్లను కూడా తయారు చేసి వారికి పూర్తి భరోసానిస్తే తమ‌ జట్టు మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్లను పొగడడంపై వచ్చే విమర్శలపై అక్తర్‌ మరోసారి స్పందించాడు. ‘నేనేం చెప్పాలో మీరే చెప్పండి. కోహ్లీ టాప్‌ బ్యాట్స్‌మన్‌ మాత్రమే కాదు.. 70 అంతర్జాతీయ శతకాలు నమోదు చేసిన ఆటగాడు. అలాగే ఒక కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఆటగాళ్లే టీమ్‌ఇండియాకు విజయాలు అందిస్తున్నారు. అలాంటప్పుడు వారిని ఎలా తిట్టగలను? ఒక కచ్చితమైన ప్రణాళిక, దూకుడు స్వభావంతో భారత్‌ ముందుకు దూసుకు వెళుతోంది. బుమ్రానే ఉదాహరణగా తీసుకోండి. అతడెంతో మెరుగయ్యాడు. అలాంటి ఆటగాడిని ఏమని విమర్శించాలి?’ అని మాజీ పేసర్‌ ఎదురు ప్రశ్నించాడు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని