‘నువ్వేకావాలి’ తెర వెనుక కథ ఇదే..! - Sravanthi Ravikishore About Nuvve Kavali 20 Years
close
Updated : 12/10/2020 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నువ్వేకావాలి’ తెర వెనుక కథ ఇదే..!

నా ఆర్థిక ఇబ్బందులన్నీ తీరాయి: స్రవంతి రవికిషోర్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సూపర్‌హిట్ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ ‘నువ్వేకావాలి’. తరుణ్‌, రిచాపల్లాడ్‌, సాయికిరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 20 వసంతాలు (13-10-2020) పూర్తి అవుతోంది. ‘నువ్వే కావాలి’ని తెరకెక్కించాలనే భావన మొదట ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ స్రవంతి రవికిషోర్‌కి కలిగింది. ఆ సమయంలో తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఉషాకిరణ్‌ మూవీస్‌ సహకారంతో ఈ ఫీల్‌ గుడ్‌ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ‘నువ్వేకావాలి’ సినిమా గురించి స్రవంతి రవికిషోర్‌ మాటల్లోనే వినండి. 

‘‘నువ్వే కావాలి’ చిత్రం 20 వసంతాలు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అప్పట్లో మూడు కోట్ల మంది పైచిలుకు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూశారు. ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి ఇప్పటికీ ఎంతో ప్రేక్షకాదరణ ఉంది. ‘నువ్వే కావాలి’ సినిమాకి మాతృక మలయాళీ ‘నిరమ్‌’. ఆ చిత్రం నా మనసుకు బాగా దగ్గరయ్యింది. తెలుగు ప్రేక్షకులకు అలాంటి చిత్రాన్ని అందించాలనిపించింది. వెంటనే నేను దర్శకుడు విజయ్‌భాస్కర్‌కి కాల్‌ చేసి మంచి సినిమా ఉంది చేద్దామని చెప్పాను. ఆ తర్వాత ఓ రోజు నేను, విజయ్‌భాస్కర్‌, త్రివిక్రమ్‌.. ‘నిరమ్‌’ చిత్రాన్ని చూశాం. దానిని ప్రేరణగా తీసుకుని వాళ్లు ‘నువ్వేకావాలి’ స్ర్కిప్ట్‌ సిద్ధం చేశారు.’

‘‘నిరమ్‌’ సినిమాని స్ఫూర్తిగా తీసుకున్నారు తప్ప... ఆ కథలోని సన్నివేశాలకు, తెలుగులో మనం చూస్తున్న సన్నివేశాలకు చాలావరకూ మార్పులు ఉంటాయి. స్ర్కిప్ట్‌ అయితే సిద్ధం చేయిస్తున్నాను కానీ ఆ సమయంలో నా దగ్గర సినిమా నిర్మించే ఆర్థిక స్థోమత లేదు. కొన్నిసార్లు నా సొంత అవసరాలు కూడా తీర్చుకోలేని ఆర్థిక ఇబ్బందులను ఆ రోజుల్లో చూశాను. కానీ ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే గట్టి సంకల్పం మాత్రం నాలో ఉంది.’ 

‘అలాంటి సమయంలో ‘మంచి కథ ఉంటే చెప్పండి. మన బ్యానర్‌లో సినిమా చేద్దాం’ అని ఓ సందర్భంలో రామోజీరావు గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే ఓ రోజు ఆయన్ని కలిసి ‘నిరమ్‌’ చిత్రాన్ని చూపించి.. మాతృకలో కొన్ని మార్పులు చేస్తున్నామని, వారం సమయం ఇవ్వమని అడిగాను. ‘మీరు చేయబోయే పనిమీద నీకు నమ్మకం ఉంది కదా. కాబట్టి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. చిత్రీకరణ పనిలో ముందుకు వెళ్లండి’ అని ఆయన భరోసా ఇచ్చారు. ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆ సినిమా హిస్టరీని క్రియేట్‌ చేయడమే కాదు, అప్పటివరకూ నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ ‘నువ్వే కావాలి’తో తీరిపోయాయి.’ అని స్రవంతి రవికిషోర్‌ వెల్లడించారు.

‘మంచి టెక్నీషియన్స్‌.. పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో తెరకెక్కించిన అద్భుతమైన చిత్రం ‘నువ్వేకావాలి’. ఓ రోజు సినిమా పనిమీద తరుణ్‌ వాళ్ల ఇంటికి వెళ్లాం. ఆ సమయంలో అతను కాలేజ్‌కి వెళ్తున్నాడు. అతన్ని చూసిన వెంటనే మా కథకు చక్కగా సరిపోతాడు అనిపించింది. నిజం చెప్పాలంటే.. ‘నువ్వేకావాలి’ సినిమాలో తరుణ్‌ నటించలేదు. జీవించేశాడు. కోటి మ్యూజిక్‌తో మేజిక్‌ చేశాడు. కోటి మీకు మీరే సాటి. సిరివెన్నెల సీతారామశాస్త్రి.. అందించిన లిరిక్స్ అద్భుతం. నాకో మంచి సినిమాని అందించిన రామోజీరావు గారికి, రవికిషోర్‌కి ధన్యవాదాలు ’ అని దర్శకుడు కె.విజయ్‌ భాస్కర్‌ పేర్కొన్నారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని