కరోనా వేళ..ఉత్తరానికి మరో ముప్పు! - Stubble Burning Can Exacerbate Coronavirus Crisis
close
Updated : 21/09/2020 15:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వేళ..ఉత్తరానికి మరో ముప్పు!

పంట మొదళ్లు తగలబెట్టడం మరింత ప్రమాదకరం

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఉత్తర భారత వాసులకు మరో ముప్పు పొంచివుంది. హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం తాజా పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని వాతావరణ, వ్వవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ బాధితులకు ఇది మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు.

చలికాలం ప్రారంభ సమయంలో జరిగే పంట మొదళ్లు తగలబెట్టడం ప్రతి ఏటా ఓ సమస్యగా మారిన విషయం తెలిసిందే. వీటివల్ల ఏర్పడే కాలుష్యంతో దేశరాజధాని దిల్లీతోపాటు ఉత్తర భారత్‌ ప్రాంతమంతా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా గాలి కాలుష్య కారకాలైన పీఎం స్థాయిలతో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువుల పెరుగుదలకు  కారణమవుతున్నాయి. దీంతో వాతావరణంలో కాలుష్య స్థాయి 18నుంచి 40శాతం పెరుగుదలకు ఈ పంటల దహన ప్రక్రియ కారణమవుతున్నట్లు ఇప్పటికే నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. దిల్లీలో పెరిగే వాయుకాలుష్యానికి ఈ రెండు రాష్ట్రాల్లో పంట మొదళ్లు దహనం చేయడమేనని ఇప్పటికే నిపుణులు నివేదించారు. తాజాగా ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు పంజాబ్‌కు వ్యవసాయ నిర్వహణ సలహాదారుగా ఉన్న సంజీవ్‌ నాగ్‌పాల్ స్పష్టంచేస్తున్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ.. పంట మొదళ్లను కాల్చడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

తీవ్ర శ్వాసకోస సమస్యలకు కారణమయ్యే ఈ చర్యలు తాజాగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణకు మరింత ఆజ్యం పోసే అవకాశాలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ‘పంట వ్యర్థాలను తగులబెట్టడంతో నేలలో ఉండే సిలికాన్‌ కూడా తగ్గిపోతుంది. తద్వారా మానవుల రోగనిరోధక శక్తికి దోహదం చేసే సిలికా స్థాయి శరీరంలో తగ్గిపోతుంది. దీంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తాజాగా కొవిడ్‌తో సతమతమవుతోన్న వేళ ఈ చర్యలు మరింత విషమంగా మార్చే అవకాశాలున్నాయి’ అని సంజీవ్‌ నాగ్‌పాల్ స్పష్టంచేస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని పంట మొదళ్లను కాల్చే ప్రక్రియను తగ్గించడంతోపాటు వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు కృషిచేయాలని పర్యావరణ నిపుణుల సూచిస్తున్నారు.

ఇక పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలో చేపట్టే ఈ పంట మొదళ్లను కాల్చే చర్యలతో దిల్లీలో 44శాతం వాయుకాలుష్యం పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలు స్పష్టంచేశాయి. అయితే, వీటిని అడ్డుకోవడం మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారింది. కేవలం పంజాబ్‌ రాష్ట్రంలోనే గత సంవత్సరం దాదాపు 50వేల కేసులు నమోదుచేశారు. అయితే రైతులకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకపోవడం కూడా ప్రభుత్వాల వైఫల్యంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాలుష్యం వల్ల దిల్లీ, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలకు ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు అంచనా వేశాయి. ఇదిలాఉంటే, దేశ రాజధానితోపాటు పంజాబ్‌లో  వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని