మంటలు ఎగసి పడటంతోనే శ్రీశైలంలో ప్రమాదం - TS Electricity dept announcement aginst srisailam fire accident
close
Published : 22/08/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంటలు ఎగసి పడటంతోనే శ్రీశైలంలో ప్రమాదం

ప్రకటించిన విద్యుత్‌ శాఖ

శ్రీశైలం: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ప్యానల్‌ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడడంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ విద్యుత్‌ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇప్పటి వరకు రెస్క్యూ సిబ్బంది ఎనిమిది మృతదేహాలను వెలికితీయగా.. మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది. మృతులను డీఈ శ్రీనివాస్‌ (హైదరాబాద్‌), ఏఈలు వెంకట్‌రావు (పాల్వంచ),  మోహన్‌కుమార్‌, ఉజ్మఫాతిమా(హైదరాబాద్), సుందర్‌ (సూర్యాపేట), జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ కిరణ్‌, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్, మహేశ్‌ (హైదరాబాద్‌)గా గుర్తించారు.

900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటలకు అగ్ని ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ వెల్లడించించింది.  ప్రమాదం పసిగట్టిన ఉద్యోగులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది. రాత్రి 12 గంటల వరకు ఉద్యోగులు తమ ప్రయత్నాలు కొనసాగించారని, అప్పటికీ తమ వల్ల కాకపోవడంతో ప్లాంటులోని ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి, జరిగిన ప్రమాదంపై సమాచారమందించారని ప్రకటనలో పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు ప్లాంటులో ఉన్నారు. వారిలో 8 మంది బయటకు రాగలిగారు. కానీ మిగిలిన 9 మంది అక్కడే చిక్కుకుపోయారు. ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి వారు ప్రయత్నించినప్పటికీ దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదని విద్యుత్‌ శాఖ తెలిపింది.

ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. జల విద్యుత్‌ కేంద్రం భూ మట్టానికి 1.2 కిలోమీటర్ల లోతులో ఉంది. అక్కడికి సొరంగ మార్గం ద్వారా మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. మంటలు, పొగలు కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నట్లు విద్యుత్‌ శాఖ వెల్లడించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని