ఓబులమ్మా.. బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ - Telugu News Keeravani About Obulamma Song
close
Updated : 02/09/2021 07:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓబులమ్మా.. బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ

కీరవాణి.... ప్రేక్షకులకు స్వరవాణిగానే తెలుసు. అప్పుడప్పుడు స్వరానికి సాహిత్యాన్ని అలంకరిస్తుంటారు. గడ్డ పెరుగు లాంటి పాటలను తినిపించి... వినిపించి... శ్రోతల మనసులను హాయిగా నిద్రపుచ్చుతారు. తాజాగా క్రిష్‌ తెరకెక్కించిన ‘కొండపొలం’ చిత్రంలో ఓ పాటకు సంగీతంతోపాటు సాహిత్యాన్నీ అందించారు. ఈ సినిమాలోని ఏడు పాటల్లో మూడింటిని రాశారు. వాటిలో ఓబులమ్మ మొదటి పాటగా విడుదలై శ్రోతలను ఆలరిస్తోంది. ఈ పాటతో తన ప్రయాణాన్ని కీరవాణి ‘ఈనాడు సినిమా’తో పంచుకున్నారు.
‘‘క్రిష్‌ సినిమాలకు పాట రాయడం ముచ్చటగా అనిపిస్తుంటుంది. నన్ను పాటలు రాయమని పట్టుపట్టే వాళ్లల్లో క్రిష్‌ ముందుంటారు. రాయడం నా వృత్తి కానప్పటికీ ఆయన కోసం అప్పుడప్పుడు రాయాల్సి వస్తుంది. ఈ పాట కర్నూలు జిల్లాలోని మాండలికంతో రాసింది. ఈ పాట రాసే ముందు సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రచించిన కొండపొలం నవల చదివాను. ఆ పుస్తకంలో ఆయన పొందుపర్చిన మాటలతోపాటు మరికొన్ని పదాలను జోడించి రాశా. కాలమంతా లెక్కలు గట్టి, కాలమంతా లెక్కలు తప్పి మాటలు అలా ఉపయోగించినవే. వాస్తవానికి ఈ మాండలికం నాకు పెద్దగా తెలియదు. ఈ పాట రాయడం కోసమే ఆ పుస్తకం చదివి అందులోని మాటలను పాట రూపంలోకి మార్చాను. చాలా వరకు పదాల అర్థాలు ఆ పుస్తకం చివర అనుబంధ పట్టికలో నుంచి తీసుకున్నాను. సన్నపురెడ్డి గారు పాట విని బాగుందన్నారు. ఆయన అప్రూవ్‌ చేశాకే ముందుకెళ్లాం. ఆయన్ని ఇప్పటి వరకు నేను ముఖాముఖీ కలవలేదు. కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.


చిత్రం: కొండపొలం
కథ: సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
దర్శకత్వం: క్రిష్‌ జాగర్లమూడి
నటీనటులు: వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌
సాహిత్యం- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
గానం: సత్యయామిని, పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌

పల్లవి:
గింజ గింజ మీద...  
బుసక బుసక బుసక తీసి
తీయంగా బత్తెమయ్యి పోయే  
బొట్టే కట్టి చేత బట్టిన
చేతిలోకి చేరలేని గుండుజళ్ళ
ఆరాట పడిపోయే  
ఓ ఓ ఓబులమ్మా బొమ్మ కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ  
కపర కపర వేకువ లోన
కాలమంతా లెక్కలు గట్టి  
గుండెలోన నీ పేరు జపమాయె..  
యిదివరకెపుడు తెలియని ఎరగని  
తురుపే మైమరిపిస్తూ ఉంటె  
కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే

చరణం 1:
కన్నులు కన్నులు వింటున్న
చూపులు చూపులు చెబుతున్న  
మాటలు మాటలు చూస్తున్న  

మగతలలో..
ఎవ్వరికెవ్వరు సావాసం  
ఎక్కడికక్కడ ప్రయాణం  
ఎప్పటికప్పుడు ఎదురయ్యే  
మలుపులలో
చదివేసాడేమో నా కలలు  
ఉంటాడే నీడై రేపవలు  
తిష్టేసినాడే గోంతరాలు
పొమ్మంటే పోడే ఈడిగలు..  
ఓ.... ఓ ఓబులమ్మా పుట్టచెండు
ఆటల్లోనా పూలకొమ్మ.

చరణం 2:
కపర కపర రేతిరి లోన
కాలమంతా లెక్కలు తప్పి
గుండెలోన నీ పేరు జపమాయె..  
యిదివరకెపుడు తెలియని ఎరగని  
తలపే మైమరిపిస్తూ ఉంటె  
కంటికేమో కునుకు దూరపు చుట్టమాయే  
ఓ ఓ ఓబులమ్మా బొమ్మ
కర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ  
ఓ ఓ ఓబులమ్మా పుట్టచెండు
ఆటల్లోనా పూలకొమ్మ


మొదట వనవాసి...
ఈ పాటలో వైష్ణవ్‌ను చూసినవాళ్లు చాలా ఖరీదైన దుస్తులు వేసుకున్నాడని కామెంట్స్‌ చేస్తున్నారు. తను ఈ చిత్రంలో చదువుకున్న కుర్రాడు. కొండపొలం చదవని వాళ్లకు అతను అర్థం కాడు. క్రిష్‌ ఎందుకు తనకు ఆ బట్టలు వేయించారో సినిమా చూస్తే తెలుస్తుంది. కొండపొలం అనేది ఓ కొలిమి లాంటిదని నా అభిప్రాయం. ఆత్మన్యూనత భావనలో ఉన్న మనిషిని బంగారంగా మారుస్తుంది. క్రిష్‌ మొదట ఈ కథకు ‘వనవాసి’ అని పేరు అనుకున్నారు. దానికి నేను ఓటు వేయలేదు. చాలా మంది కొండపొలానికే మొగ్గుచూపారు.


‘గోంతరాలు’ అలా వచ్చిందే
ఈ పాటలో ‘తిష్టవేసినాడే గోంతరాలు’ లైన్‌ ఉంటుంది. అందులో గోంతరాలు పదం నాకు బాగా నచ్చింది. గుహాంతరాలు లాగే గోంతరాలు ముద్దుగా ఉంది. చిన్న పిల్లలు కొన్ని పదాలు పలకలేక తప్పుగా పలుకుతారు. అవి మనకు ముద్దుగా అనిపిస్తాయి. మా మేనకోడలు ఎక్స్‌ను ఎస్కు అనేది. మిగతా అక్షరాలను చక్కగానే చెప్పేది. ఎక్స్‌ వరకు వచ్చే సరికి ఎస్కు అనేది. అలా అనడం మనకు తప్పే అనిపించినా చిన్నపిల్లలు అంటుంటే ముద్దుగా ఉంటాయి. అట్లా గోంతరాలు గుహాంతరాల్లో నుంచి వచ్చిందే కాబట్టి నాకు బాగా నచ్చింది.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని