Vaccine: సత్తా చాటిన ఉష్ణ టీకా - Telugu News Mynvax is effective against all major variants
close
Updated : 16/07/2021 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: సత్తా చాటిన ఉష్ణ టీకా

కరోనాలోని ఆందోళనకర వేరియంట్లకు కళ్లెం

శీతల నిల్వ కేంద్రాల్లో భద్రపరచాల్సిన అవసరం లేని ‘ఉష్ణ’ టీకాలను సాకారం చేసే దిశగా భారత్, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. అన్ని రకాల కరోనా వైరస్‌లపై ఇవి సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. భారత్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, మైన్‌వ్యాక్స్‌ అనే బయోటెక్‌ సంస్థ ఈ టీకాలను అభివృద్ధి చేశాయి. వీటి సామర్థ్యంపై ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆధ్వర్యంలోని కామన్‌వెల్త్‌ శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన సంస్థ (సీఎస్‌ఐఆర్‌వో) మదింపు జరిపింది. కరోనాలోని అన్ని రకాలపై వీటిని పరీక్షించి చూసింది.  ఈ టీకాలు ఎలుకల్లో బలమైన రోగనిరోధక స్పందనలను కలిగించాయని, హ్యామస్టర్స్‌కు గట్టి రక్షణ కల్పించాయని వెల్లడైంది. 37 డిగ్రీల సెల్సియస్‌ వద్ద కూడా ఈ టీకాలు నెల రోజుల పాటు చెక్కు చెదరకుండా ఉన్నాయని, 100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద 90 నిమిషాల వరకూ అవి దెబ్బతినకుండా ఉన్నాయని తేలింది. ‘‘ఈ టీకాల వల్ల కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను సమర్థంగా అడ్డుకునే యాంటీబాడీలు ఉత్పత్తవుతున్నట్లు మా పరిశోధనలో వెల్లడైంది’’ అని సీఎస్‌ఐఆర్‌వోలోని కొవిడ్‌-19 ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ శేషాద్రి వాసన్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

మైన్‌వ్యాక్స్‌ రూపొందించిన అనేక టీకా ఫార్ములేషన్లను తాము జంతువులపై పరీక్షించామని, వీటిలో మానవ ప్రయోగాలకు అనువైన వ్యాక్సిన్‌ను గుర్తించడానికి ఇది దోహదపడిందని చెప్పారు. భారత్‌లో త్వరలో క్లినికల్‌  ప్రయోగాలు జరుగుతాయన్నారు. ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లను శీతల యంత్రాల్లో భద్రపరచడం తప్పనిసరి. ఉదాహరణకు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాను 2-8 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నిల్వ చేయాలి. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ మేర చల్లదనాన్ని అందించే ప్రత్యేక శీతల స్టోరేజీ యంత్రాలు అవసరం. మారుమూల ప్రాంతాల్లో ఇలాంటివి అందుబాటులో ఉండవు. భారత పరిశోధకులు రూపొందించిన టీకాల వల్ల ఇలాంటి చోట్ల పంపిణీ సులువవుతుంది.   -ఈనాడు ప్రత్యేక విభాగం 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని