ఓటీటీలో తెలుగు చిత్రం: ఏది హిట్‌.. ఏది ఫట్‌..! - Telugu movies that released on OTT in 2020
close
Published : 22/12/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీటీలో తెలుగు చిత్రం: ఏది హిట్‌.. ఏది ఫట్‌..!

ఓటీటీలో మెరిసిందెవరు?

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనాతో యావత్‌ ప్రపంచం చిగురుటాకులా వణికిపోయింది. అన్ని రంగాలతో పాటు చిత్ర పరిశ్రమకు కూడా తీరని నష్టం వాటిల్లింది. లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో చిత్రీకరణ పూర్తి చేసుకుని వేసవిలో సందడి చేద్దామనుకున్న చిత్రాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో దర్శక-నిర్మాతలకు కనిపించిన దారి ‘ఓటీటీ’. ప్రేక్షకుడు థియేటర్‌కు రాలేని పరిస్థితుల్లోనే సినిమానే ప్రేక్షకుడి దగ్గరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడ్డాయి ఈ ఓటీటీ వేదికలు. అన్ని భాషల్లోనూ అనేక చిత్రాలు ఈ వేదికలపై సందడి చేశాయి. అలా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రాలేవో.. అవి ఎంతమేరకు ఆకట్టుకున్నాయో ఓ సారి చూద్దామా!

ఆ చిత్రంతో మొదలు..!

లాక్‌డౌన్‌లో ఓటీటీ వేదికగా విడుదలైన తొలి తెలుగు చిత్రం ‘అమృతారామమ్‌’. సురేందర్‌ కొంటాడి దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం యువతను దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.


మిస్టరీ థ్రిల్లర్‌తో కీర్తి

‘మహానటి’ తర్వాత కీర్తి సురేశ్‌ సినిమాలను ఎంచుకునే విషయంలో వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘పెంగ్విన్‌’. ఇందులో కీర్తి ఒక బిడ్డకు తల్లిగా కనిపిస్తున్నారని తెలీడంతో చిత్రంపై అందరిలోనూ అంచనాలను నెలకొన్నాయి. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కాగా, మిస్టరీ థ్రిల్లర్‌గా మెప్పించినా, అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయింది.


కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా

యువ కథానాయకుడు రానా సమర్పణలో సంజయ్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’. రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలిని కీలక పాత్రలు పోషించారు. ‘ఆహా’ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది.


పరిణతి చెందిన ప్రేమ కథగా..

నవీన్‌ చంద్ర, సలోని లుత్రా జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. శ్రీకాంత్‌ నాగోతు దర్శకత్వం వహించారు. ‘ఆహా’ వేదికగా విడుదలైన ఈ చిత్రం యువతను విశేషంగా అలరించింది. 30ఏళ్లు దాటిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమలో పడితే వారిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? బాధ్యతగా ఉన్న ప్రేమ చాలా ఉత్సాహకరంగా ఉంటుందన్నది దర్శకుడు హృద్యంగా చూపించాడు.


ఉమా మహేశ్వరరావుకు కోపం వస్తే..

వైవిధ్య కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న నటుడు సత్యదేవ్‌. ఆయన కీలక పాత్రలో వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘మహేశ్ అంటే ప్రతీకార’ చిత్రం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం ఫీల్‌ గుడ్‌ మూవీగా ప్రేక్షకులను అలరించింది.


‘విగ్రహం’ కింద నలిగిన జీవితాలు

భావి తరాలకు స్ఫూర్తి ప్రధాతలైన వారి విగ్రహాలను ఏర్పాటు చేయడంలో తప్పు లేదు. కానీ, స్వార్థం, రాజకీయ స్వప్రయోజనాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది? నలుగురి జీవితాలు ఎలా చిన్నాభిన్నం అయ్యాయనే ఇతి వృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘జోహార్‌’. తేజ మర్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. నేటి రాజకీయలపై చురకలంటించేలా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంది.


అంచనాలను అందుకోలేని ‘వి’చిత్రం

‘నేచురల్‌ స్టార్‌’గా అభిమానులు పిలుచుకునే నానిది ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర. పోలీస్‌ ఆఫీసర్‌గా యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లుక్‌లో సుధీర్‌బాబు. నటనకు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రేక్షకుడిని మైమరపించే అందాల తారలు.. నివేదా థామస్‌, అదితి రావు హైదరీ. పైగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. వీళ్లు చాలు సినిమాపై అంచనాలు పెరగడానికి. నాని నటన బాగుంది. సవాళ్లు ప్రతి సవాళ్లు ఉత్కంఠగా ఉన్నాయి. పాటలూ బాగున్నాయి. కానీ, ఏదో వెలితి. నాని సినిమా అంటే ఇది కాదేమో. అందుకే ‘వి’ ఆ అంచనాలను అందుకోలేక ఓ ‘వి’చిత్రంగా మిగిలిపోయింది.


అనుష్కది అదే పరిస్థితి

అనుష్క ‘నిశ్శబ్దం’ పరిస్థితి కూడా ‘వి’లానే అయింది. బదిర యువతిగా అనుష్క, ఇతర పాత్రల్లో మాధవన్‌, షాలిని పాండే, అంజలి, మైఖేల్‌ మాడిసన్‌ వంటి వారు నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ, వాటిని అందుకోవడంలో ‘నిశ్శబ్దం’ తడబడింది. థ్రిల్లర్‌ చిత్రంగా హేమంత్‌ మధుకర్‌ తీర్చిదిద్దినా ఎక్కడో ఆ మేజిక్‌ ‘నిశ్శబ్దం’గా ఉండిపోయింది.


ఒరేయ్‌ బుజ్జిగా..

కరోనా కాలంలో ఓటీటీ ప్రేక్షకులను కాస్త ఎంటర్‌టైన్‌చేసిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌కుమార్‌ కొండా దర్శకత్వంలో రాజ్‌తరుణ్‌, మాళవిక నాయర్‌, హెబ్బాపటేల్‌ నటించిన ఈ చిత్రం నవ్వులు పంచింది.


బ్లాక్‌ అండ్‌ వైట్‌ ప్రేమ కథ

సందీప్‌రాజ్‌ దర్శకత్వంలో సుహాస్‌, చాందినీ చౌదరి నటించిన ప్రేమ కథా చిత్రం ‘కలర్‌ ఫోటో’. సునీల్‌ కీలక పాత్రలో నటించారు. 90ల నాటి ప్రేమకథాగా తెరకెక్కిన ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. అటు ప్రేక్షకులతో పాటు, ఇటు విమర్శకులను మెప్పించింది.


మిస్‌ ఫైర్‌ అయిన ‘మిస్‌ ఇండియా’

ఈ ఏడాది ఓటీటీ వేదికగానే మరోసారి పలకరించిన తార కీర్తి సురేశ్‌. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మిస్‌ ఇండియా’. వ్యాపారవేత్తగా ఎదగాలనుకున్న మానస అనే మహిళగా కీర్తి మెప్పించలేకపోయింది.


థ్రిల్లింగ్‌ ‘గతం’

కిరణ్‌ కొండ మడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్‌ మూవీ ‘గతం’. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ తెచ్చుకుంది. అంతేకాదు, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శించనున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది.


బొంబాయి చట్నీ అదిరింది

ఆనంద్‌ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా వినోద్‌ అనంతోజు దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ డ్రామా ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’. ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను అలరించింది. సినిమాలోని పాత్రలన్నీ సహజంగా ఉండటం, కథానాయకుడి తండ్రి పాత్రలో గోపరాజు రమణ నటన అందరికీ నవ్వులు పంచింది.

వీటితో పాటు, మా వింత గాథ వినుమా, బొంబాట్‌, ఐఐటీ కృష్ణమూర్తి, గువ్వా గోరింక, డర్టీ హరి, అమరం అఖిలం ప్రేమ తదితర చిత్రాలు ఓటీటీలో సందడి చేశాయి.

ఇవీ చదవండి...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని